NTR: ‘వీధిఅరుగు’ ఆధ్వర్యంలో శకపురుషుని శత వసంతోత్సవాలు

ఆన్‌లైన్‌ వేదికగా వీధిఅరుగు-నార్వే ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Updated : 28 May 2023 23:05 IST

నార్వే: ‘‘వీధి అరుగు-నార్వే’’ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా తెలుగు సాహిత్య సాంస్కృతిక సంస్థల భాగస్వామ్యంతో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను మే 27న ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ప్రసార మాధ్యమాల ద్వారా ఇప్పటివరకు దాదాపు 30 వేల మంది వీక్షించారు. ఇంటర్నెట్‌ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనం ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన వ్యక్తిత్వం భావితరాలకు మార్గదర్శకమని చెప్పారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రపంచంలోని తెలుగువారంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తెలుగు వారి హృదయాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో  ప్రపంచవ్యాప్తంగా పలు తెలుగు సంఘాలు భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. ఎన్టీఆర్‌ పట్ల తెలుగు ప్రజలకున్న ఎల్లలు లేని అభిమానానికి ఇదే నిదర్శమన్నారు. ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. అద్భుతమైన ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, తమను సైతం ఇందులో భాగస్వాములను చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.

ప్రముఖ చలనచిత్ర నటుడు మాగంటి మురళీమోహన్, నిర్మాత చలసాని అశ్వనీ దత్‌, నారా బ్రాహ్మణి, కె.లక్ష్మీనారాయణ, డా.విజయభాస్కర్ దీర్ఘాశి, గుమ్మడి గోపాలకృష్ణ, డా. శంకర నారాయణ తదితర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. వీధిఅరుగు ఆధ్వర్యంలో కార్యక్రమం మొదలు పెట్టినప్పటికీ 40 దేశాల నుంచి తెలుగు సంస్థలు సహకారం అందించాయి. ముఖ్యంగా వివిధ సంస్థల నుంచి అనేక మంది చిన్నారులు, పెద్దలు ఎన్టీఆర్ నటించిన సినిమాల నుంచి పద్యాలు, పాటలు, నృత్యాలు చేశారు. అంతర్జాలంలో అంతర్జాతీయంగా 14 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన ఈ కార్యక్రమం.. ఎన్టీఆర్ గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేందుకు వారధి కాగలదని వీధి అరుగు వ్యవస్థాపకులు వెంకట్ తరిగోపుల తెలిపారు.

ఈ కార్యక్రమానికి సుధాకర్ రావు కుదరవల్లి, విక్రమ్ సుఖవాసి, పావని రాగిపాని, నవీన్ సామ్రాట్ జలగడుగు, లక్ష్మణ్ వెన్నెపురెడ్డి, వై. భార్గవ్, లక్ష్మి రాయవరపు, శిరీష తూనుగుంట్ల, రాజగోపాల్ మోహన్ ఆరేటి, అశోక్ కుమార్ పారా సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ప్రసార మాధ్యమ సంస్థలకు, మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వెంకట్ తరిగోపులకి, ఆయన బృందానికి వివిధ సంస్థల అధినేతలు అభినందనలు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని