NRI TDP: డెలావేర్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు

తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను అమెరికాలోని డెలావేర్‌లో

Updated : 06 Sep 2022 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను అమెరికాలోని డెలావేర్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూఎస్‌ఏ ఆధ్వర్యంలో డెలావర్‌కు చెందిన పార్టీ నేతలు హరీశ్‌ కోయ, లక్ష్మణ్‌ పర్వతనేని పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్‌ చిత్రపటం వద్ద నేతలు నివాళులర్పించారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐ తెదేపా నేత సత్యా అట్లూరి స్వాగతోపన్యాసం చేశారు. తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌ దగ్గర ఎన్టీఆర్‌ నిర్వహించిన ర్యాలీని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. హరీశ్‌ కోయ మాట్లాడుతూ దేవినేని ఉమతో తనకున్న అనుబంధాన్ని, నీటి పారుదల శాఖకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. 

 

అనంతరం దేవినేని ఉమ మాట్లాడుతూ ఏపీలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చి సీఎం జగన్‌ దుర్మార్గ పాలనను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అరాచక పాలనను కలసికట్టుగా ఎదుర్కొని రానున్న ఎన్నికల్లో వైకాపాకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. డెలావేర్‌ సీనియర్‌ నేత వెలువోలు శ్యాంబాబు మాట్లాడుతూ మళ్లీ తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.

డెలావేర్‌ ఎన్‌ఆర్‌ఐ తెదేపా తరఫున సత్యా పొన్నగంటి మాట్లాడుతూ “జల మూల మిదం జగత్’’ అనే సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో పాటు మైలవరం నియోజకవర్గానికి సంజీవని లాంటి చింతలపూడి ప్రాజెక్టులను చంద్రబాబు ఆలోచనలతో దేవినేని ఉమ ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. సుధాకర్‌ తురగా మాట్లాడుతూ బూత్‌లెవల్లో ఓట్ల వెరిఫికేషన్‌ మొదలుపెట్టిన మొదటి నేత దేవినేని ఉమ అని.. ఆయన స్ఫూర్తితో తెదేపా అభ్యర్థులు, నేతలు ప్రతి నియోజకవర్గంలో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్‌ ఆలూరు, విశ్వనాథ్‌ కోగంటి, లక్ష్మీకాంతం కోయ, చందు ఆరె, కిశోర్‌ కాకులకుంట్లతో పాటు పెన్సిల్వేనియా ఎన్‌ఆర్‌ఐ తెదేపా నేతలు పొట్లూరి రవి, సునీల్‌ కోగంటి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని