NTR: శక పురుషుడికి శత జయంతి నీరాజనం!

డెట్రాయిట్‌ నగరంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ మనుమరాలు సుహాసిని, ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల, దర్శకుడు వైవీఎస్‌ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు

Published : 03 Jun 2023 20:33 IST

డెట్రాయిట్‌: అమెరికాలోని డెట్రాయిట్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డెట్రాయిట్‌ గళంగా పిలిచే.. ఉదయ్‌ చాపలమడుగు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నడిపించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ మనుమరాలు  సుహాసిని, ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల, దర్శకుడు వైవీఎస్‌ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ..కుటుంబ సభ్యులతో ఎన్టీఆర్‌ ఎంతో సరదాగా గడిపేవారని అన్నారు. తన తండ్రి హరికృష్ణతో చాలాసార్లు తాతగారి దగ్గరికి వెళ్లినట్లు చెప్పారు. తాతగారి స్మృతులు ఇప్పటికీ గుర్తున్నాయని, ఆయన అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు. జొన్నవిత్తుల మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను తాను చాలా దగ్గర నుంచి చూశానని చెప్పారు. తాను అవ‌ధానం చేసిన సమయంలో ఓ సంద‌ర్భంలో ఎన్టీఆర్‌ తన దగ్గరకి వచ్చి కొన్ని ప్రశ్నలు ఇచ్చి పూరించమని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషన్నా.. యాసన్నా.. ఎన్టీఆర్‌కు ప్రాణంతో సమానమని చెప్పారు.

వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ.. పేదలకు ఏదైనా చేయాలని నిత్యం పరితపించేవారని, ఆయన ఎక్కడున్నా పేదలు, రాష్ట్రం, తెలుగుప్రజల గురించే ఆలోచించేవారని చెప్పారు. ఆయ‌న దర్శకత్వం వహించిన సినిమాల్లో ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో తెలుగు భాష‌కు పట్టంగట్టారని అన్నారు. కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా డా. హనుమయ్య, డా. హరినాథ్‌, బసవేంద్ర వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. బాలబాలికలు ఎన్టీఆర్‌పై రూపొందించిన ప్రాజెక్టును ఇక్కడ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌ అభిమానులు, డెట్రాయిట్‌ ప్రజలు పాల్గొన్నారు. సురేశ్‌ పుట్టగుంట ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరచగా.. ఫహద్‌, సునీల్‌ పాంట్రా, మనోరమ గొంధి, సీత కావూరి, జో పెద్దిబోయిన, కిరణ్‌ దుగ్గిరాల, ఉమా, మురళి గింజిపల్లి నిర్వాహక సభ్యులుగా వ్యవహరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని