NTR: ఏపీ పునర్నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యం: మన్నవ సుబ్బారావు

అమెరికాలోని హారీస్‌బర్గ్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ప్రవాసాంధ్రుడు కృషి చేయాలని గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు తెలిపారు.

Published : 04 Jun 2023 22:24 IST

హారీస్‌బర్గ్:  ఏపీ పునర్నిర్మాణం తెదేపా అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని గుంటూరు మిర్చియార్డ్‌ మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు అన్నారు. అమెరికాలోని హారీస్‌బర్గ్ మహా నగరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మన్నవ సుబ్బారావుతోపాటు ప్రముఖ దర్శకులు వైవీఎస్ చౌదరి, డా. మీగడ రామలింగస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. సీఎం జగన్ బారినుంచి రాష్ట్రాన్ని కేవలం చంద్రబాబునాయుడు మాత్రమే కాపాడగలుగుతారన్నారు. దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనం ఈ సమాజానికి శాపం కాకూడదని తెలిపారు. తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ప్రవాసాంధ్రుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెదేపా తిరిగి అధికారంలోకి వస్తేనే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు.

అన్నిటికంటే తాను ఎన్టీఆర్ అభిమానినని అనిపించుకోవడమే గర్వకారణంగా ఉంటుందని వైవీఎస్‌ చౌదరి అన్నారు. ‘‘ నా దినచర్యే ఎన్టీఆర్ నామస్మరణతో ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ నాకు భగవంతుడితో సమానం. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ చరిత్ర అజరామరంగా నిలుస్తుంది’’అని చౌదరి తెలిపారు. ఎన్టీఆర్‌ తెలుగు భాషకు, తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని డా. లింగస్వామి కొనియాడారు. సినీ, రాజకీయ జీవితంలో రారాజుగా వెలుగొందారని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం హారీస్ బర్గ్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. 

ఈ కార్యక్రమంలో సతీష్ చుండ్రు, సాంబ అంచ, వెంకట్ సింగు, వెంకట్ చిమ్మిలి, శశి జాస్తి, రాజు గుండాల, వంశీ ముప్పాళ్ల, శ్రీనివాసరావు కోట, వెంకట సుబ్బారావు ముప్ప, సునీల్ పొందూరి, ప్రవీణ్ జంపన, శ్రీనివాస్ అబ్బూరి, ఉపేంద్ర దేవినేని, సాంబ నిమ్మగడ్డ, శ్రీనివాస్ కాకర్ల, వేణు మక్కెన, రాంబాబు కావూరి, గోపీచంద్ తలశిల, ప్రతాప్ యార్లగడ్డ, కిషోర్ కొంక, చక్రవర్తి, నాగార్జున నల్లమోతు, చంద్ర, మైనేని రాంప్రసాద్, భాను మాగులూరి, కిషోర్ కంచర్ల, సాయి బొల్లినేని తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎన్టీఆర్ రూపాల్లో చిన్నారులు తమ నృత్య ప్రదర్శనలతో కనువిందు చేశారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు హాజరయ్యారు. ప్రముఖ గాయని దీప్తి నాగ్, ప్రసాద్ సింహాద్రి తమ సంగీత విభావరితో ఆకట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని