NTR: న్యూజెర్సీలో ‘అడవి రాముడు’ రీ రిలీజ్‌

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అమెరికాలోని న్యూజెర్సీలో ‘ అడవి రాముడు’ సినిమాను రీ రిలీజ్‌ చేశారు. తద్వారా వచ్చిన వసూళ్లను బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళంగా ఇవ్వనున్నట్లు మన్నవ సుబ్బారావు తెలిపారు.

Published : 29 May 2023 20:12 IST

న్యూజెర్సీ: కృషి ఉంటే మనుషులు రుషులవుతారని గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు అన్నారు. రాధాకృష్ణ నల్లమల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఆయన నటించిన ‘అడవిరాముడు’ చిత్రాన్ని అమెరికా వ్యాప్తంగా 120 నగరాల్లో రీ రిలీజ్ చేశారు. న్యూజెర్సీలో ‘అడవిరాముడు’ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌ వద్ద ప్రవాసాంధ్రులు సందడి చేశారు.

ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు సినిమా 1977లో విడుదలై అఖండ విజయం సాధించింది. ఆ రోజుల్లోనే 3 కోట్ల కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. రీ రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు, ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున థియేటర్‌కు తరలివచ్చి ఈ సినిమాను వీక్షించి మైమరచిపోయారు’’ అని అన్నారు. తాజా వసూళ్లను బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. 

మరోవైపు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ సిటీ నడి బొడ్డులోని టైమ్ స్క్వేర్ వద్ద 200 అడుగుల నిడివిగల డిజిటల్ స్క్రీన్‌పై వివిధ రూపాల్లో ఎన్టీఆర్ చిత్రాలను ప్రదర్శించినట్లు మన్నవ తెలిపారు. ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తూ నినాదాలతో హోరెత్తించినట్లు చెప్పారు. ఫ్రిస్కో, ఇల్లినాయిస్ నగర మేయర్లు ఎన్టీఆర్ జన్మదినాన్ని తెలుగు హెరిటేజ్ డే గా ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ వాసిరెడ్డి, వంశీ వెనిగళ్ల, రమణ నల్లాని, రఘు చదలవాడ, నాయుడు ఈర్లె, పవన్ తాతా, మోహన్ వెనిగళ్ల, కిరణ్ చాగర్లమూడి, కొత్త కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు