తెలుగువారి ఆత్మగౌరవానికి ఆధ్యులు ‘ఎన్టీఆర్‌’.. వాషింగ్టన్‌ డీసీలోఎన్టీఆర్‌ వర్ధంతి

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవానికి ఆధ్యులని తానా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ వేమన అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఈ నెల 18న నందమూరి తారకరామారావు 26వ.....

Published : 19 Jan 2022 22:26 IST

వాషింగ్టన్‌ డీసీ: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవానికి ఆధ్యులని తానా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ వేమన అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఈ నెల 18న నందమూరి తారకరామారావు 26వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సతీశ్‌ వేమన మాట్లాడుతూ.. నిలువెత్తు తెలుగు తేజం, నిండైన వ్యక్తిత్వంతో తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన దైవం ఎన్టీఆర్‌ అని కొనియాడారు. చరిత్ర అన్న పదానికి చిహ్నంగా నిలిచిన నాయకుడు.. నట జీవితాన్ని ప్రజా జీవితం కోసం అర్పించిన మహానాయకుడన్నారు. చైతన్య రథం ఎక్కి చరిత్ర సృష్టించి, రాజకీయ శూన్యతను రూపుమాపి, తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపిన జన నేత అన్నారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి గట్టి పునాదులతో బడుగు, బలహీనవర్గాల, దళిత సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజలతో మమేకమయ్యారని గుర్తు చేసుకున్నారు. కుల, మత ప్రాంతాలకతీతంగా పలు రంగాల్లో ఉన్న ఎంతోమంది తెలుగువారికి ఆయన ఆశయాలే స్ఫూర్తి అని తెలిపారు. సినిమాల్లో రాముడిగా, కృష్ణుడి వేషధారణతో ప్రతి తెలుగువారి గుండెల్లో ఆరాథ్య దైవంగా నిలిచిన ఎన్టీఆర్‌ ఓ యుగపురుషుడని కొనియాడారు.

స్వచ్ఛమైన రాజకీయాల కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుంటూరు జిల్లా మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు అన్నారు. తెలుగువారికి ఆత్మగౌరవం ఎన్టీఆర్‌ ఇచ్చిన గొప్ప వరమన్నారు. పచ్చజెండాతో తెలుగువారిలో కొత్త ఉత్సాహం నింపారని, తెరపై ధీరోదాత్తమైన పాత్రల్లో నటించి పండిత పామరుల్ని మెప్పించారన్నారు. వామహస్త అభయం ఆచరణలో పెట్టి ప్రజల్ని మెప్పించారన్నారు. ఎన్టీఆర్‌ తన నటనతో జానపదా చిత్రాలకే వన్నె తెచ్చారని కొనియాడారు. దిల్లీ వెన్నులో వణుకు పుట్టించి, కేంద్రానికి కంటిమీద కునుకులేకుండా చేసిన ఎన్టీఆర్‌ ఈనాడు భౌతికంగా మన మధ్యలేకపోయినా.. ఆయన నటన, పాలన, మాట, బాట తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. తన మాటే శాసనంగా ఆయన చూపిన బాటే తెలుగువారి భవిష్యత్‌కు మార్గదర్శకమన్నారు. 

రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని ఎన్‌ఆర్‌ఐ నరేన్‌ కొడాలి అన్నారు. తను ఏ పాత్రలో నటించినా దానికి పూర్తిగా న్యాయం చేయాలని తపించిన అతి కొద్దిమంది నటుల్లో ఎన్టీఆర్‌ ఒకరన్నారు. నాటి, నేటి పాలకులకు ఎన్టీఆర్‌ చూపిన ప్రజాహిత పాలనే ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్‌ ఉప్పలపాటి, రఘు మేకా, రవి అడుసుమల్లి, రవి గౌరినేని, కార్తీక్‌ కోమటి, సిద్ధార్థ బోయపాటి, సాయి సుమంత్‌ శ్రీరామ్‌, డా.నాగ దేవినేని, డా. లిఖిత్‌ యల్లా, రమేష్‌ అవిరినేని తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని