
పాక్‌లో మోదీకి జేజేలు.. ఎందుకంటే..
సాన్ (పాకిస్థాన్): పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో నేడు జరిగిన ఓ ర్యాలీలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుకూల నినాదాలతో కూడిన ప్లకార్డులు దర్శనమిచ్చాయి. దివంగత సింధీ నేత జీ.ఎం. సయ్యద్ 117వ జయంతిని పురస్కరించుకుని.. తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కోరుతూ ఆయన స్వస్థలమైన జామ్‌షోరో జిల్లాలోని సాన్ పట్టణంలో ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు ‘సింధుదేశ్’ కావాలనే నినాదాలు మిన్నంటాయి.
ఏమిటీ సింధుదేశ్?
పాక్‌లోని ప్రావిన్స్‌లలో సింధ్ ఒకటి. కరాచీ రాజధానిగా గల ఈ ప్రాంతంలో సింధీలు అధికంగా నివసిస్తారు. వీరిలో అధికంగా హిందువులు, సిక్కులు ఉంటారు. భారత్‌లోని గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్నాయి. పాక్‌లో నివసించే హిందువుల్లో అత్యధికులు సింధ్ ప్రాంతం లోనే ఉంటారు. ప్రత్యేక సంస్కృతి, చరిత్ర తమ సొంతమని స్థానిక నేతలు వెల్లడించారు. ఈ ప్రదేశం సింధు నదీ నాగరికతకు, వేద ధర్మానికి నెలవని.. దీనిని బ్రిటిష్ వారు ఆక్రమించుకుని, 1947లో పాక్‌లో కలిపివేశారని వారు ఆరోపించారు. ఉర్దూను అధికార భాషగా చేయటం, ఆ ప్రాంతానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వక పోవటం వంటి కారణాలతో.. ఇక్కడి ప్రజలు పాక్ నుంచి విడిపోయేందుకు 1972 నుంచి ఉద్యమాలు సాగిస్తున్నారు. తమకు ప్రత్యేక ‘సింధుదేశ్’ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
పాక్ ప్రభుత్వం సింధ్, బెలూచ్ ప్రజలను రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తూ.. ఉగ్రవాదులనే ముద్రవేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాము విముక్తి పొందేందుకు మోదీ తదితర ప్రజాస్వామిక ప్రభుత్వాల నేతలందరూ తమకు సహాయం చేయాలని ఆ ప్రాంత నేతలు కోరారు. అదే విధంగా నియంతృత్వ పాలన నడుస్తున్న చైనా, పాక్, ఉత్తర కొరియాలను.. అవి ప్రజాస్వామిక దేశాలుగా మారేవరకు ఏకాకులను చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి..
27 నగరాల్లో మెట్రో రైలు.. మోదీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.