ఎన్టీఆర్‌ ఆశయాల సాధనకు పునరంకితమవుదాం: సతీష్‌ వేమన

మహానటుడు ఎన్టీఆర్‌  జన్మదిన పండుగను ఘనంగా నిర్వహించుకొని, ఆయన ఆశయాల సాధనకు పునరంకితమవ్వాలని తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన అన్నారు.

Published : 19 May 2023 01:33 IST

 వాషింగ్టన్‌ డీసీలో శత జయంతి ఉత్సవాల సన్నాహక సమావేశం 

వాషింగ్టన్‌ డీసీ: విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకులను ఘనంగా నిర్వహించుకొని, ఆయన ఆశయాల సాధనకు పునరంకితమవ్వాలని తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన అన్నారు. ఈ నెల 28న ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించనున్న ఉత్సవాల సన్నాహక సమావేశం, ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ.. ఉత్సవాలలో 2వేల పైచిలుకు ఎన్టీఆర్‌ అభిమానులు, కుటుంబ సమేతంగా పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఆ మహనీయుని స్మరించుకొని, సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు, తెదేపా నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు, గౌరవ అతిథులుగా జయరాం కోమటి, మన్నవ సుబ్బారావు హాజరవుతారని తెలిపారు.

‘‘ఒక తరం గుండెల్లో కొలువైన దేవుడు.. మరో తరం ఆత్మ గౌరవం తట్టి లేపిన ప్రజా నాయకుడు.. నేటి తరానికి సమాజ శ్రేయస్సును పాటించాలని నిత్యం గుర్తుచేసే శత వసంతాల శకపురుషుడు ఎన్టీఆర్‌ అని, ఆయన ఆదర్శాలను, జీవితకాలం ఆయన పాటించిన ప్రమాణాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకంగా పాటించాలని’’ పలువురు అభిప్రాయపడ్డారు. ఈ శతజయంతి ఉత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలతో పాటు కార్యక్రమానికి వచ్చే వారికోసం పసందైన వంటకాలను వడ్డించనున్నారు. విదేశాలలో మొదటి సారిగా అచ్చమైన 100 రకాల తెలుగింటి సంప్రదాయ వంటకాలను సిద్ధం చేసి ఈ ఉత్సవాలకు హాజరయ్యే అభిమానులకు, మహిళలకు, చిన్నారులకు అందించి ఈ కార్యక్రమం ఒక చిరకాల జ్ఞాపకంగా తెలుగు వారి మదిలో మిగిలిపోవాలని నిర్వాహకులు భావిస్తున్నారు. శతజయంతి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన వారిలో సుధీర్ కొమ్మి, అనిల్ ఉప్పలపాటి, యశస్వి బొద్దులూరి, సాయి బొల్లినేని, కార్తీక్ కోమటి, భాను మాగులూరి, రవి అడుసుమిల్లి, యలమంచిలి చౌదరి, యువ సిద్దార్థ్‌ బోయపాటి తదితరులు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని