Mahatma Gandhi: ‘మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత పురస్కారం ఇవ్వాలి’

సత్యం, అహింసలే ఆయుధాలుగా భారత్‌కు స్వాతంత్ర్యం సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన మన జాతిపిత మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత పౌరపురస్కారం ‘కాంగ్రెషనల్‌ గోల్డ్‌ మెడల్‌’ ప్రదానం చేయాలన...

Updated : 14 Aug 2021 13:33 IST

అక్కడి చట్టసభలో తీర్మానం ప్రవేశపెట్టిన కరోలిన్‌ బి. మాలోనీ

  

వాషింగ్టన్‌: సత్యం, అహింసలే ఆయుధాలుగా భారత్‌కు స్వాతంత్ర్యం సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన మన జాతిపిత మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత పౌరపురస్కారం ‘కాంగ్రెషనల్‌ గోల్డ్‌ మెడల్‌(మరణానంతరం)’ ప్రదానం చేయాలని అక్కడి ఓ ప్రముఖ చట్టసభ సభ్యుడు ప్రతిపాదించారు. ఈ మేరకు దిగువ సభ ‘ప్రతినిధుల సభ’లో తీర్మానాన్ని పునఃప్రవేశపెట్టారు. గాంధీ అనుసరించిన సత్యాగ్రహ మార్గం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ప్రముఖుల్లో స్ఫూర్తి నింపినట్లు గుర్తు చేశారు.

‘‘మహాత్మా గాంధీ అనుసరించిన ‘సత్యాగ్రహ’ నిరసన మార్గం యావత్తు ప్రపంచంలో స్ఫూర్తి నింపింది. ఇతరులకు సేవ చేయాలనే సత్కార్యంలో నిమగ్నులవ్వాలనే శక్తిని మనలో నింపుతుంది. వర్ణ సమానత్వం కోసం పోరాడిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ నుంచి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్‌ మండేలా వరకు ప్రతిఒక్కరినీ కదలించింది. ఓ ప్రజా ప్రతినిధిగా ఆయన ఆదర్శాల నుంచి నేను ప్రతిరోజు స్ఫూర్తి పొందుతున్నాను. ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పును మందు మనలోనే చూద్దామన్న గాంధీ మార్గదర్శకాలను ప్రతిఒక్కరం పాటిద్దాం’’ అని తీర్మానాన్ని ప్రవేశపెడుతూ కరోలిన్‌ బి. మాలోనీ అన్నారు.

ఒకవేళ మహాత్మునికి కాంగ్రెషనల్‌ గోల్డ్‌ మెడల్‌ను ప్రకటిస్తే.. భారత్‌ గడ్డపై పుట్టి ఈ గౌరవం పొందిన తొలి వ్యక్తి ఆయనే అవుతారు. జార్జ్‌ వాషింగ్టన్‌, నెల్సన్‌ మండేలా, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌, మదర్‌ థెరిసా, రోసా పార్క్స్‌.. ఈ అత్యున్నత పురస్కారం అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. భారత్‌కు స్వాతంత్ర్య సిద్ధించి 75వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా అమెరికా చట్టసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని