రాయల్‌ ఆస్కాట్‌లో అబ్బురపరిచిన రేసు గుర్రాలు

బ్రిటన్‌లో అత్యంత ప్రసిద్ధిగాంచిన రాయల్‌ ఆస్కాట్‌ రేస్‌ కోర్స్‌లో గుర్రపు పందేలు అబ్బుర పరుస్తున్నాయి.

Updated : 20 Jun 2024 19:47 IST

లండన్‌: బ్రిటన్‌లో అత్యంత ప్రసిద్ధిగాంచిన రాయల్‌ ఆస్కాట్‌ రేస్‌ కోర్స్‌లో గుర్రపు పందేలు అబ్బుర పరుస్తున్నాయి. జూన్‌ 18న అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో మొదలైన ఈ పోటీలు వారం పాటు కొనసాగనున్నాయి. రాజకుటుంబీకులతో పాటు బ్రిటన్‌లోని సంపన్నులు ఈ పోటీల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. క్వీన్‌ అన్నే 1711లో ప్రారంభించిన ఈ రాయల్‌ ఆస్కాట్‌కు ఎంతో ఘనమైన చరిత్ర, వారసత్వం ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రేస్ కోర్స్‌ల్లో ఒకటైన రాయల్ ఆస్కాట్‌లో ఏటా రేస్‌ డేలు, నాన్-రేసింగ్ ఈవెంట్‌లు నిర్వహిస్తుంటారు. అత్యంత సంపన్నులు పాల్గొనే ఈ ప్రపంచస్థాయి ఈవెంట్‌లో రాజ కుటుంబీకులే స్వయంగా తమ గుర్రాలపై వచ్చి రేస్‌లలో పాల్గొంటుంటారు.

యూకేలోని అత్యంత ఖరీదైన పట్టణాల్లో ఒకటైన ఆస్కాట్‌ విలేజ్‌కు అనేకమంది ప్రముఖులు తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం బ్రిటన్‌లో ‘లేడీస్‌ డే’ సందర్భంగా అనేకమంది మహిళలు విభిన్న వస్త్రధారణ, టోపీలు పెట్టుకొని అక్కడికొచ్చి పరుగులు తీసే గుర్రాలను చూస్తే ఉత్సాహంతో సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ షోలతో ఉన్నత శ్రేణికి చెందిన మహిళలు తమ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. రేస్‌కోర్సులో ఏర్పాటు చేసిన పసందైన విందు భోజనం, సంగీత కార్యక్రమాలను ఆస్వాదిస్తూ అంతా ఆనందంగా గడిపారు. ఈ రేస్‌ కోర్సుల్లో నిర్వహించే ప్రతి గుర్రపు పందెంలో విజేతలకు పౌండ్ల రూపంలో భారీగా ఇచ్చే ప్రైజ్‌మనీ మారుతూ ఉంటుంది. ఈ రేసుల్లో పాల్గొనే గుర్రాల వయసు రెండేళ్ల నుంచి ప్రారంభమవుతుంది.

రాయల్ ఆస్కాట్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిచెందిన గుర్రపు పందెం ఈవెంట్‌. పశ్చిమ లండన్‌కు 25 మైళ్ల దూరంలోని బెర్క్‌షైర్‌లో ఏటా జూన్‌లో ‘అస్కాట్ రేస్‌కోర్స్‌’లో నిర్వహిస్తారు. ఇక్కడ నిర్వహించే గుర్రపు పందేల్లో పలు రకాలు ఉన్నాయి. ఈ ఈవెంట్‌కు వచ్చిన వారికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ కూడా ఉంటుంది. పురుషులు సూట్‌ ధరించగా.. మహిళలు హ్యాట్‌లు, ప్రత్యేక వస్త్రధారణతో సందడి చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని