శెభాష్‌.. సాహిత్‌.. న్యూజెర్సీలో తెలుగు విద్యార్థి సత్తా!

తెలంగాణకు చెందిన 12 ఏళ్ల సాహిత్‌ మంగు అమెరికాలో సత్తా చాటాడు.  తన అసామాన్య నైపుణ్యాలను ప్రదర్శించి న్యూజెర్సీలో గోల్డెన్‌ గావెల్‌ టాప్‌ స్పీకర్‌ అవార్డును సొంతం చేసుకొని ఔరా! అనిపించాడు

Published : 08 Feb 2023 19:54 IST

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో ఓ తెలుగు విద్యార్థి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అక్కడ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక గార్డెన్‌ స్టేట్‌ డిబేట్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో తన నైపుణ్యాలతో ఆకట్టుకొని విజేతగా నిలిచి అందరి ప్రశంసలు అందుకొంటున్నాడు. తెలంగాణకు చెందిన 12 ఏళ్ల సాహిత్ కుటుంబం న్యూజెర్సీలో స్థిరపడగా.. ఈ విద్యార్థి సెడార్‌ హిల్‌ ప్రిపరేటరీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. న్యూజెర్సీలో ఏటా నిర్వహించే ప్రతిష్ఠాత్మక గార్డెన్‌ స్టేట్‌ డిబెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌కు ఈ ఏడాది పలు పాఠశాలల నుంచి 164 మంది విద్యార్థులు పాల్గొనగా.. సాహిత్‌ మంగు తన అసామాన నైపుణ్యాలను ప్రదర్శించి గోల్డెన్‌ గావెల్‌ టాప్‌ స్పీకర్‌ అవార్డును సొంతం చేసుకొని ఔరా! అనిపించాడు. సాహిత్‌ ఎంచుకున్న అంశాలతో పాటు ఆయా అంశాల పట్ల అతడికి ఉన్న అవగాహన, వాక్చాతుర్యం, లోతైన పరిశీలన వంటివి న్యాయ నిర్ణేతలను అమితంగా ఆకట్టుకున్నాయి. 

ఎంచుకున్న అంశాలివే.. 

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేధించడం, అమెరికాలో అందరికీ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడం, ఫేసియల్ టెక్నాలజీతో చెడు కన్నా మంచే ఎక్కువ జరుగుతుందని చెప్పడం.. మాంసాహారం అనైతికం అనే అంశాలను తన టాపిక్స్‌గా ఎంచుకున్న సాహిత్‌ మంగు.. వీటిపై అనర్గళంగా మాట్లాడి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.తన స్నేహితుడితో డిబేట్‌లో పాల్గొని ఈ నాలుగు అంశాలపైనా విజేతగా నిలిచాడు. ఇండో అమెరికన్‌ అయిన సాహిత్‌ మంగు తెలుగులోనూ అనర్గళంగా మాట్లాడగలడు. ఈ అవార్డుతో పాటు స్కూల్‌లో పాటలు పాడటం, డిబేట్లలో అనేక అవార్డులు వచ్చాయి. ఈ పోటీల్లో కెడార్‌ హిల్‌ ప్రిపరేటరీ స్కూల్‌తో పాటు  విల్బెర్‌ఫోర్స్‌ స్కూల్‌, వీలియం అన్నెస్‌ మిడిల్‌ స్కూళ్లకు చెందిన విద్యార్థులు టాప్‌ 10 విజేతలుగా నిలిచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని