ఖతార్‌లో ఘనంగా ‘ఆంధ్ర కళా వేదిక’ సంక్రాంతి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోని ప్రవాస భారతీయులూ సంక్రాంతి సంబరాల్ని ఎంతో ఘనంగా జరుపుకొన్నారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తూ.......

Published : 18 Jan 2022 16:20 IST

ఖతార్‌: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోని ప్రవాస భారతీయులూ సంక్రాంతి సంబరాల్ని ఎంతో ఘనంగా జరుపుకొన్నారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తూ మన దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఖతార్‌లోని ‘ఆంధ్ర కళా వేదిక’ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త కార్యవర్గం ‘వెంకప్ప భాగవతుల’ అధ్యక్షతన నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఇంటిల్లిపాది సంప్రదాయ వస్త్రధారణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొవిడ్ నేపథ్యంలో మాస్కులు ధరిస్తూ వేడుకలను జరుపుకొన్నారు. ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌లోని అశోకా హాలులో నిర్వహించిన ఈ వేడుకల్లో ఖతార్‌లో భారత రాయబారి డాక్టర్ దీపక్ మిత్తల్‌, మేడమ్ అంబాసిడర్ డాక్టర్ అల్పనా మిత్తల్‌తో పాటు ఐసీసీ సమన్వయ అధికారి జేవియర్ ధనరాజ్ తదితరులు పాల్గొని మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు. అలాగే గాలిపటాలను ఎగురవేసి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. రంగోలి మేళాలో విజేతలుగా నిలిచిన నీరజా రెడ్డి కందుల (తొలి స్థానం), కవితా మురళీ మురుగన్‌ (రెండో స్థానం), గాయత్రి మొగరాలా (మూడో స్థానం)లకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు.


 

ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో ఐసీసీ అధ్యక్షుడు పీఎన్‌ బాబురాజన్, ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్, ఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్ కేఎస్‌ ప్రసాద్, ఐసీబీఎఫ్‌ అధ్యక్షుడు జియాద్ ఉస్మాన్, రజనీ మూర్తితో పాటు మణికంఠన్, వినోద్ నాయర్, సుబ్రహ్మణ్య హెబ్బగులు, సబిత్ సాహిర్ సహా అనేకమంది ప్రముఖులు ,ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రకళా వేదిక కొత్త మేనేజ్‌మెంట్‌ బృందం ప్రమాణ స్వీకారం, సాంస్కృతిక కార్యక్రమాలు, గొబ్బిళ్ళ నాట్యాలు, హరిదాసు, గోదాదేవి అలంకరణలో పిల్లలకు భోగిపళ్లు, కార్యనిర్వాహక వర్గ కుటుంబాలు తయారు చేసిన రుచికరమైన తెలుగింటి వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సంక్రాంతి సంబరాలకు శిరీషా రామ్, శ్రీసుధ వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా.. ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ప్రారంభ సందేశం ఇచ్చారు. అధ్యక్షులు వెంకప్ప భాగవతుల ముగింపు సందేశ ధన్యవాదాలతో ఈ కార్యక్రమం ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు