1985 నాటి ఎయిరిండియా పేలుళ్ల కేసులో నిర్దోషి.. దారుణ హత్య

దాదాపు 35 సంవత్సరాల క్రితం ఎయిరిండియా విమానాన్ని ఉగ్రవాదులు పేల్చేసిన కేసులో నిర్దోషిగా తేలిన ఓ సిక్కు వ్యక్తి.. కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. 75 ఏళ్ల రిపుదమన్‌ సింగ్‌ మాలిక్‌ను సర్రే ప్రాంతంలో

Updated : 15 Jul 2022 14:52 IST

టొరొంటో: దాదాపు 35 సంవత్సరాల క్రితం ఎయిరిండియా విమానాన్ని ఉగ్రవాదులు పేల్చేసిన కేసులో నిర్దోషిగా తేలిన ఓ సిక్కు నేత.. కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. 75 ఏళ్ల రిపుదమన్‌ సింగ్‌ మాలిక్‌ను సర్రే ప్రాంతంలో కొందరు దుండగులు గురువారం టార్గెట్‌ చేసి మరీ చంపేసినట్లు కెనడా పోలీసులు వెల్లడించారు.

మాలిక్‌ తన కారులో వెళ్తుండగా అడ్డగించిన దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మాలిక్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. తొలుత మృతుడిని పోలీసులు గుర్తించలేదు. ఆ తర్వాత మాలిక్‌ను హత్య చేసినట్లు అతడి కుమారుడు జస్ప్రీత్‌ మాలిక్‌ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. అయితే ఎయిరిండియా బాంబు పేలుళ్ల కేసులో తన తండ్రి నిర్దోషిగా తేలినప్పటికీ.. అతడిని నిందితుడిగానే చూస్తున్నారని జస్ప్రీత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత హత్యకు.. పేలుళ్ల ఘటనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే మాలిక్‌ హత్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడు ఓ వివాదాస్పద వ్యక్తి అని, పలువురితో వ్యక్తిగత కక్షలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాలిక్‌ కెనడాలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. వాంకోవర్‌ కేంద్రంగా పనిచేసే ఖల్సా క్రెడిట్‌ యూనియన్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ యూనియన్‌లో 16వేల మంది సభ్యులున్నారు. దీంతో పాటు సర్రే, వాంకోవర్‌ ప్రాంతంలో పలు స్కూళ్లను నిర్వహిస్తున్నారు.

1985లో ఎయిరిండియా పేలుళ్ల ఘటన కెనడా చరిత్రలోనే గాక, విమాన ప్రమాదాల్లోనే అత్యంత భీకరమైన ఉగ్ర ఘటన. ఆ ఏడాది జూన్‌ 23న 329 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఓ ఎయిరిండియా విమానం టొరొంటో నుంచి బాంబే(ఇప్పటి ముంబయి) బయల్దేరింది. మధ్యలో మాంట్రియల్‌ విమానాశ్రయంలో కాసేపు ఆగింది. అక్కడి నుంచి బయల్దేరి అట్లాంటిక్‌ సముద్రం మీద 31వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా విమానం కార్గోలో ఓ సూట్‌కేస్‌లో అమర్చిన బాంబు పేలి విమానం తునాతునకలైంది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తోన్న అందరూ మృతిచెందారు. మృతుల్లో 268 కెనడా పౌరులుండగా.. 24 మంది భారతీయులున్నారు.

1984లో స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదులున్నారన్న ఆరోపణలతో భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపింది. ఈ ఘటనకు ప్రతీకారంగానే ఖలిస్థానీ అతివాదులు ఎయిరిండియా విమానాన్ని పేల్చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో ఇంద్రజీత్‌ సింగ్‌ రేయాత్‌ అనే వ్యక్తిని దోషిగా తేలగా.. మాలిక్‌, మరో వ్యక్తి సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా 2005లో నిర్దోషులుగా బయటపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని