Sunitha: ఈ పాఠశాలకు వస్తుంటా.. నావంతు సహకారం అందిస్తా: గాయని సునీత

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మి ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలలో కొత్త కంప్యూటర్ ల్యాబ్‌ ప్రారంభమైంది. ఈ ల్యాబ్‌ను ప్రముఖ సినీ గాయని సునీత, ........

Published : 21 Oct 2021 19:04 IST

ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మి ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలలో కొత్తగా కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ ల్యాబ్‌ను ప్రముఖ సినీ గాయని సునీత, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి ప్రారంభించారు. ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్న బాలభారతి పాఠశాల మహిళాశక్తికి నిదర్శనమని, వారందరినీ అభినందిస్తున్నట్లు సునీత తెలిపారు. బాలభారతి పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి మరిన్ని పాఠశాలలు రావాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులోనూ బాలభారతి పాఠశాలకు తాను వస్తుంటానని, తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాల విద్యార్థులను ఎన్నారై విద్యార్థులతో ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసి ఆధునిక సాంకేతిక విద్యను బోధించేందుకు కృషిచేస్తానని కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ ఛైర్మన్ పొట్లూరి రవి తెలిపారు. ఈ సందర్భంగా సునీత అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. వారికి చాక్లెట్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. 

అంతకముందు, తమ పాఠశాలకు విచ్చేసిన అతిథులకు బాలభారతి పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. స్వయంకృషితో ఎదిగిన సునీతలాంటి కళాకారులు అందరికీ ఆదర్శనీయమని, మరిన్ని విజయశిఖరాలు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ఎన్నారైల సహకారంతో విద్య, వైద్య రంగాల్లో సేవలందిస్తామని, నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణా శిబిరాలు, సదస్సులు నిర్వహించనున్నట్టు ఫౌండేషన్‌ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్‌ తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన కళాకారులు, మేధావులు, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పొదుపులక్ష్మి ఐక్యసంఘానికి చెందిన పలువురు మహిళలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని