Ukraine-Russia: ఉక్రెయిన్‌కు బయలుదేరిన ఎయిరిండియా ప్రత్యేక విమానం

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది....

Updated : 22 Feb 2022 12:41 IST

దిల్లీ: ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఎయిరిండియా ప్రత్యేక విమానాన్ని ఉక్రెయిన్‌కు పంపింది. ఈ రోజు ఉదయం దిల్లీ నుంచి డ్రీమ్‌లైనర్‌ బీ-787 బయలుదేరింది. 200 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని ఈ ప్రత్యేక ఆపరేషన్‌కు వినియోగించనున్నారు. ఈరోజు రాత్రి ఇది తిరిగి దిల్లీకి చేరుకుంటుంది.

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తతలు ముదురుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌ నేపథ్యంలోఉక్రెయిన్‌ నుంచి విమానాల రాకపోకలపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేసింది. ఈ నెలలో మూడు ప్రత్యేక వందే భారత్‌ విమానాలను ఉక్రెయిన్‌-భారత్‌ మధ్య నడపనున్నట్లు ఫిబ్రవరి 18న ఎయిరిండియా ప్రకటించింది. ఈ నెల 22, 24, 26న ఇవి ఇరు దేశాల మధ్య నడవనున్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద విమానాశ్రయమైన బోరీస్పిల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇవి కార్యకలాపాలు కొనసాగించనున్నాయి.

సరిహద్దుల్లో భారీ ఎత్తున సైన్యాన్ని, ఆయుధాలను మోహరించిన రష్యా.. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర్య ప్రదేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. వీటిని ‘రిపబ్లిక్‌ పీపుల్‌ ఆఫ్‌ ది స్టేట్స్‌’గా పేర్కొంది. ఉక్రెయిన్‌ ప్రభుత్వంతో, పాలనతో ఇకపై ఈ ప్రాంతాలకు ఎలాంటి సంబంధాలు ఉండవని ప్రకటించింది. దీన్ని ఉక్రెయిన్‌, అమెరికాతో పాటు నాటో కూటమి దేశాలు తీవ్రంగా ఖండించాయి. రష్యా గుర్తించిన ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. ఐరోపా సమాఖ్య సైతం రష్యాపై ఆంక్షలకు వెనుకాడబోమని హెచ్చరించింది. మరోవైపు తాము శాంతినే కాంక్షిస్తున్నామని.. కానీ, తమ భూభాగాన్ని కోల్పోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని