US: అరుదైన గౌరవం.. అమెరికాలో వీధికి ‘గణేశ్ టెంపుల్ స్ట్రీట్’గా నామకరణం

అగ్రరాజ్యంలో భారతీయ సంస్కృతికి అరుదైన గౌరవం దక్కింది. అక్కడి ఓ వీధికి ‘గణేష్ టెంపుల్ స్ట్రీట్’ అని నామకరణం చేశారు.......

Published : 04 Apr 2022 22:01 IST

న్యూయార్క్‌: అగ్రరాజ్యంలో భారతీయ సంస్కృతికి అరుదైన గౌరవం దక్కింది. అక్కడి ఓ వీధికి ‘గణేశ్‌ టెంపుల్ స్ట్రీట్’ అని నామకరణం చేశారు. న్యూయార్క్‌ క్వీన్స్ కౌంటీలోని ఫ్లషింగ్‌లో 1977లో ది హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో మహా వల్లభ గణపతి దేవస్థానాన్ని స్థాపించారు. అప్పటినుంచి ఆ దేవాలయాన్ని గణేశ్‌ టెంపుల్ అని పిలుస్తున్నారు. ఇది ఉత్తర అమెరికాలోని పురాతన హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అక్కడున్న  ఎన్నారైలు ఆలయానికి వెళ్లి పూజలు, అర్చనలు చేస్తున్నారు.

కాగా ఆ గుడి బయట ఉన్న వీధికి ‘బౌనీ స్ట్రీట్’ అని పేరు. బానిసత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రముఖ అమెరికన్ మార్గదర్శకుడు జాన్ బౌనీ పేరు ఆ వీధికి పెట్టారు. అయితే ప్రస్తుతం ఈ వీధికి గణపతి ఆలయం అనే పేరును కూడా జత చేశారు. శనివారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో  ఆలయ గౌరవార్థం ఆ వీధికి బౌనీ పేరుతో పాటు గణేశ్‌ టెంపుల్ స్ట్రీట్‌గా  అధికారికంగా ప్రకటించారు. దీంతో అక్కడున్న భారతీయులంతా ఆనందం వ్యక్తం చేశారు.

పేరును జోడించి దానికి సంబంధించిన ఓ చిహ్నాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, క్వీన్స్ బోరో ప్రెసిడెంట్ డోనోవన్ రిచర్డ్స్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. వీధి పేరు జోడించడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉందని, దీంతో ఇండో అమెరికన్ కమ్యూనిటీ గొప్పదనం గురించి ఇంకా బాగా తెలుస్తుందని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌లో న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలోని ఓ కమిటీ బౌన్ స్ట్రీట్‌, గణేశ్‌ టెంపుల్ స్ట్రీట్‌ అనే పేరు జోడించడానికి ఆమోదించిందని ఆలయ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని