ఉత్సాహంగా తాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌.. ఫైనల్స్‌లో మెరిసిన ‘సూపర్‌స్టార్స్‌’

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) ఆధ్వర్యంలో ‘శుభోదయం తాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌) క్రికెట్‌ టోర్నమెంట్‌’ పోటీలు.....

Published : 25 Aug 2022 17:03 IST

లండన్‌: తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) ఆధ్వర్యంలో ‘శుభోదయం తాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌) క్రికెట్‌ టోర్నమెంట్‌’ విజయవంతంగా ముగిసింది. ఆగస్టు 21న (ఆదివారం) లండన్‌లోని ఓస్టర్లీలో ఇండియన్‌ జింఖానా క్లబ్‌లో ఉత్సాహంగా జరిగాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో మొత్తంగా 12 జట్లు పాల్గొనగా సూపర్‌స్టార్స్‌, వైజాగ్ బ్లూస్‌ జట్లు ఫైనల్స్‌కు చేరాయి. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో సూపర్‌స్టార్స్‌ జట్టు టీపీఎల్‌ -2022 విజేతగా నిలిచింది.

ఛాంపియన్‌షిప్‌లో విజేతల వివరాలు

టీపీఎల్‌-2022 ఛాంపియన్‌: సూపర్‌స్టార్స్‌ టీమ్‌, కెప్టెన్‌, ఫ్రాంచైజీ యజమాని- వేణుగోపాల్‌ కృష్ణ నవులూరి

తొలి రన్నరప్‌ జట్టు: వైజాగ్ బ్లూస్, కెప్టెన్‌- సందీప్‌ మూవ, ఫ్రాంచైజీ యజమాని- సుమన్‌ మూవ 

రెండో రన్నరప్‌ జట్టు: యోధాస్‌, కెప్టెన్‌, ఫ్రాంచైజీ యజమాని‌- ఆనంద్‌ వేమూరి

మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌: పవన్‌ కుమార్‌ చేశెట్టి (డీజే వారియర్స్‌)

ఉత్తమ బౌలర్‌: సాయి కుమార్‌ పూజారి ((డీజే వారియర్స్‌)

ఉత్తమ బ్యాట్స్‌మన్‌: చందు నూతలపాటి (సూపర్‌స్టార్స్‌‌)

రసవత్తరంగా సాగిన ఈ ఫైనల్స్‌ను వీక్షించేందుకు 150 మందికి పైగా తమ కుటుంబాలతో కలిసి తరలివచ్చారు. తొలుత భారత్‌, బ్రిటన్‌ జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన లండన్లోని బొరొఫ్‌ హౌన్‌స్లో మేయర్‌ రఘ్‌వీందర్‌ సిద్ధూ,  హెస్టన్‌ వెస్ట్‌ కౌన్సిలర్‌ ఆడ్రియానా ఘెరోగె, ప్రత్యేక అతిథిగా న్యూలండన్‌ కళాశాలకు చెందిన విక్రమ్‌ పాల్గొని టోర్నీలో విజేతలు, ఇతరులను అభినందించి వారికి అవార్డులను ప్రదానం చేశారు. 

ఈ సందర్భంగా తాల్‌ కోశాధికారి అనిత నోముల మాట్లాడుతూ.. ఈ ఛాంపియన్‌షిప్‌ను ఎంతో విజయవంతంగా నిర్వహించిన టీపీఎల్‌ ఇన్‌ఛార్జి వాసుదేవ మే రెడ్డి, టీపీఎల్‌ కమిటీ సభ్యులు శరత్‌ పుట్టా, ముకేశ్‌ చక్రవర్తి తదితరులను అభినందించారు. దీన్ని సజావుగా నడిపించేందుకు వారంతా అవిశ్రాంతంగా కృషిచేశారన్నారు. వారి కృషిలేకపోతే ఇంత విజయవంతంగా జరిగేది కాదన్నారు. గత 14 ఏళ్లుగా తాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లను నిర్వహిస్తూ యూకేలో ఉన్న తెలుగు కుటుంబాలను అనుసంధానం చేసేలా కృషిచేస్తోందని చెప్పారు. 2012లో ప్రీమియర్‌ లీగ్‌ మోడల్‌ను నిర్వహించి అతిపెద్ద టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ని మొదలపెట్టినట్టు చెప్పారు. ఈ ఏడాది జరిగిన టోర్నమెంట్‌లో 12 జట్లు 16 వారాలపాటు ఆడాయని.. మొత్తంగా 47 మ్యాచ్‌లలో 240మంది క్రీడాకారులు తమ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారని తెలిపారు. 

టీపీఎల్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న విజేతలు, రన్నరప్‌ జట్లు, టీపీఎల్‌ ఫ్రాంచైజీ యజమానులకు తాల్‌ ఛైర్మన్‌ భారతి కందుకూరి కృతజ్ఞతలు తెలిపారు. శుభోదయం టీపీఎల్‌-2022ని విజయవంతం చేసింనందుకు అభినందనలు తెలిపారు. టీపీఎల్‌ సలహాదారులు రవి సబ్బ, శరత్‌ జెట్టి, సంజయ్‌ భిరాజు, శ్రీధర్‌ సోమిశెట్టి, ఇతర వాలంటీర్లు.. ఈ టోర్నీ సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాల్‌ ట్రస్టీలు, సలహాదారులు, వ్యవస్థాపక సభ్యులు, శాశ్వత సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని