‘తామా’ ఆధ్వర్యంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15న తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) కార్యాలయంలో ఘనంగా జరిగాయి.  పని దినం అయినా సరే  దాదాపు 270 మందికి పైగా ఈ వేడుకలకు తరలివచ్చారు.

Published : 30 Aug 2023 16:23 IST

అమెరికా: భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15న తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) కార్యాలయంలో ఘనంగా జరిగాయి. అమెరికాలో ఆరోజు పనిదినం అయినా సరే  దాదాపు 270 మందికి పైగా ఈ వేడుకలకు తరలివచ్చారు. ఈ వేడుకకు హాజరైన పెద్దలు, చిన్నారులు యువత తమ దేశభక్తిని చాటుకున్నారు. విశ్రాంత మేజర్ జనరల్ డాక్టర్ ఆర్. శివ కుమార్, ప్రొఫెసర్ పి. కె. రాజు, మేజర్ కె. గోవిందరాజ్, ప్రొఫెసర్ క్రిష్ణమూర్తి వడ్లమూడి,  ప్రభుత్వ ఉద్యోగిని భరణి, విశ్రాంత ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి, జాన్స్ క్రీక్ కౌన్సిల్ సభ్యులు బాబ్ ఎర్రమిల్లి, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి  దేవ్ రాపూరి, నేవీ ఉద్యోగిని కన్యా కుమారి విశిష్ఠ అతిథులుగా హాజరు కావడం, జాతీయ పతాకాన్ని ఎగురవేయడం, వారితో పాటు అందరూ జాతీయ గీతం ఆలపించడం, జెండా వందనం చేయడం వంటి కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి. ఇతర సంస్థలకు చెందిన పలువురు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. 

ఈ సందర్భంగా తామా అధ్యక్షుడు సాయిరామ్ కారుమంచి అతిథులందరినీ సభకు పరిచయం చేశారు. శివ కుమార్ స్వాతంత్య్ర దినోత్సవ విశిష్టతను తెలియజెప్పడంతో పాటు సైన్యంలో పని చేసినప్పటి అనుభవాలను పంచుకున్నారు. యూనిఫాం అన్నీ నేర్పిస్తుందని గోవిందరాజ్ అన్నారు. పి. కె. రాజు తన సుదీర్ఘ వృత్తి అనుభవాలను పంచుకుని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని తెలిపారు. ఇంతమంది పిల్లలు, యువత హాజరు కావడం గొప్ప విషయమనీ, వారికి చరిత్ర చెప్పడం అవసరమని కృష్ణమూర్తి అన్నారు. అలాగే, భరణి, దేవ్, కన్యా కుమారి స్వాతంత్య్ర దినోత్సవ వైభవాన్ని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వివరించారు.  అలాగే, తామా నిర్వహించే ఉచిత వైద్యశాల, మనబడి, పండుగలు, యువత, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలను బాగా చేస్తున్నారంటూ ప్రశంసించారు. యువత వీలైతే అమెరికా లేదా ఏ దేశ సైన్యంలోనైనా  కొన్ని రోజులు పని చేయాలని బాబ్ ఎర్రమిల్లి సూచించారు. ఇంతమంది వైవిధ్యమైన నిపుణులను ఒకేచోటకు తీసుకు రాగలిగినందుకు తామా ప్రతినిధులను అభినందించారు. అనంతరం అతిథులందరినీ ఘనంగా సత్కరించారు. 

ఈ వేడుకల్లో దేశ భక్తి గీతాలను పిల్లలే కాకుండా పెద్దవారు సైతం ఆలపించారు. అలాగే, తామా మనబడి ప్రతినిధులు తెలుగు భాష ఆవశ్యకతను వివరించి తరగతుల వివరాలను పంచుకున్నారు. అతిథులకు తాగునీరు, చాక్లెట్లు, పునుగులు, పకోడీ, తేనీరు అందజేశారు. తామా వారు చాలా ఏళ్లుగా భారత జాతీయ పండుగలు విధిగా నిర్వహించడం ప్రశంసనీయమంటూ తామా కృషిని కొనియాడారు. తామా బోర్డు ఛైర్మన్ సుబ్బారావు మద్దాలి చేసిన ముగింపు ప్రసంగంలో ఈ వేడుకలను దిగ్విజయం చేసినందుకు అతిథులకు, వాలంటీర్లకు, తామా టీమ్‌తో పాటు విచ్చేసిన ప్రతిఒక్కరికీ  కృతజ్ఞతలు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు