తామా ఆధ్వర్యంలో యోగ శిక్షణ శిబిరానికి విశేష స్పందన

అమెరికాలోని తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ మెట్రో అట్లాంటా (టామా) ఆధ్వర్యంలో ధ్యాన, ఆయుర్వేద, యోగ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు...

Published : 02 Apr 2023 16:52 IST

అట్లాంటా: అమెరికాలోని తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ మెట్రో అట్లాంటా (టామా) ఆధ్వర్యంలో ధ్యాన, ఆయుర్వేద, యోగ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. మార్చి 26న ఆదివారం కమ్మింగ్‌లోని షరన్‌ పార్కు కమ్యూనిటీ బిల్డింగ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఈ పురాతన అభ్యసన ప్రక్రియలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయిన నిర్వాహకులు తెలిపారు. జీవన శైలిని మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు. మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా యోగా, ఆయుర్వేద సూత్రాలు, సిద్ధ సమాధి యోగలను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్, సిద్ధ సమాధి యోగ, హార్ట్‌ఫుల్‌నెస్‌, ఈషా ఫౌండేషన్‌లు ఒకేచోట ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సెషన్లు నిర్వహించడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చని తామా ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమాలకు అమృత్‌ ఆయుర్వేదం- నాగేష్‌ కాసం, మాగ్నమ్‌ ఓపస్‌ ఐటీ- సాగర్‌ లగిశెట్టి  స్పాన్సర్లుగా వ్యవహరించినట్టు తెలిపారు. వివిధ వయస్సులకు చెందిన దాదాపు 100 మందికి పైగా ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి  స్నాక్స్‌, పానీయాలతో పాటు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.

 ఎంతో అమూల్యమైన ఈ అభ్యాసాలను పరిచయం చేయడం పట్ల వారంతా హర్షం వ్యక్తంచేశారు. మరిన్ని సెషన్లు నిర్వహించాలని తామా ప్రతినిధులను పలువురు కోరగా..  ఇలాంటి  వినూత్న, ఉపయోగకరమైన కార్యక్రమాల నిర్వహణకు తాము ఎప్పుడూ ప్రయత్నిస్తుంటామని తామా తెలిపింది. వివరాలకు  www.tama.orgని సందర్శించాలని, లేదా info@tama.orgకి ఏదైనా సమాచారం ఉంటే మెయిల్‌ చేయొచ్చని సూచించింది. ఈ కార్యక్రమంలో తొలుత అందరినీ తామా అధ్యక్షుడు సాయిరామ్‌ కారుమంచి ఆహ్వానించారు. ఛైర్మన్‌ సుబ్బరావు మద్దాలి మాట్లాడుతూ.. తమ సంస్థ చేపట్టిన పలు కార్యక్రమాలతో పాటు ఈ సెషన్ల వల్ల కలిగే ప్రయోజనాలను క్లుప్తంగా వివరించారు. అనంతరం యోగా ట్రైనర్‌ శైలజ తల్లంరాజు మాట్లాడుతూ.. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంతో పాటు ఆసనాలను ప్రదర్శించి మహిళలు ఆచరించాలని కోరారు. నాగే్‌శ కాసం  యోగసనాలు వేసి వాటి ఉపయోగాలను వివరించారు. ఆయుర్వేదంతో మెరుగైన జైవనశైలిని ఎలా పొందవచ్చో ఆయన వెల్లడించారు. అపూర్వ కల్వడే,  తనూజ కదమ్, నరేష్ చలిమెడ శ్వాస ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ధ్యానం ఎలా చేయాలో ప్రదర్శన ఇచ్చారు. అలాగే, సుధాకర్ నల్లూరి, భక్తవత్సల రెడ్డి సిద్ధ సమాధి యోగ ప్రాముఖ్యతను, రోజువారీ జీవితంలో అది ఎలా సహాయపడుతుందో వివరించారు. మనస్సును లగ్నం చేసుకొని ధ్యానాన్ని ఎలా ఆచరించాలనే అంశాన్ని శ్రీనివాస్ అల్లాడ, కళ్యాణ్ వడ్లమాని అందరికీ వివరించారు. వీరితో పాటు సునీత షెరి, జయ్‌ మాదిరెడ్డి శాంభవిక్రియను ఆచరించి చూపడంతో పాటు దాని ప్రయోజనాలను వివరించారు.  తామా బృందం నుంచి సునీల్ దేవరపల్లి, శశి, దగ్గుల, సత్య నాగేంద్ర్‌ గుత్తుల, కృష్ణ ఇనపకుతిక, తిరు చిల్లపల్లి, శ్రీనివాస్‌ రామిశెట్టి, రాఘవన్‌ తడవర్తి, ఆనంద్‌ అక్కినేని, శ్రీనివాస్‌ ఉప్పు, మధు యార్లగడ్డ, ప్రవీణ్‌ బొప్పన ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు కృషిచేశారు.  అనంతరం తామా టీమ్‌తో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులంతా గురువులను శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. వివిధ అభ్యసన క్రియలను ఆచరించిన గురువులు, స్పాన్సర్లు, ఈ సెషన్లలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తామా కృతజ్ఞతలు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని