TANA: తానా ప్రపంచసాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘ కథాసాహిత్యం’ విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంస్థ సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘కథాసాహిత్యం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Updated : 26 Jun 2023 16:53 IST

డల్లాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం( TANA) సంస్థ సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో నెలనెలా తెలుగువెలుగులో భాగంగా జూన్‌ 25న నిర్వహించిన ‘కథాసాహిత్యం’ విజయవంతమైంది. ప్రతినెలా చివరి ఆదివారం అంతర్జాతీయస్థాయిలో అంతర్జాల వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ.. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడారు. ప్రజలపై కథల ప్రభావం ఎంతో ఉందని, సామాజిక ప్రయోజనం కలిగించే కథలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ప్రతినెలా క్రమం తప్పకుండా విభిన్న సాహిత్య అంశాలపై చర్చిస్తున్న ఈ 56వ సమావేశంలో యండమూరి వీరేంద్రనాథ్‌ లాంటి సుప్రసిద్ధ రచయితలు పాల్గొనడం ఆనందంగా ఉందని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమామిళ్ల శ్రీనివాస్‌ అన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఉగ్గుపాలతో కథలు విన్న పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, దానికి పునాదులు వేయాల్సింది తల్లిదండ్రులు, కుటుంబసభ్యులేనని అన్నారు. బాల్యంలో కథలు విన్న పిల్లల మానసిక వికాసం, పరిపక్వత, పసితనంలోనే భాషపట్ల అనురక్తి కలిగి పెద్దయిన తర్వాత వాళ్లే భాషా ప్రేమికులుగా, సాహిత్యవేత్తలుగా మారుతారని చెప్పారు. 

ఈ సాహిత్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యండమూరి వీరేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. కథారచయితలు సమయం తీసుకుని, ఆలోచించి కథలు రాస్తే వాటిని చదివే పాఠకులను అవి ఆలోచింపజేస్తాయన్నారు. వేగంగా కథలు రాయడం తనవల్ల కాదని, ఒక కథ రాయాలంటే ఎన్నో నెలల నిరంతర మేధోమథనం, ఎన్నో సవరణలతో తనకు పూర్తిగా నచ్చిన తర్వాతే ఆ కథ వెలుగులోకి వస్తుందని చెప్పారు. వర్ధమాన రచయితలు సామాజిక ప్రయోజనం కలిగించే కథావస్తువులను ఎంచుకొని రచనలు చేయడం చాలా అవసరమన్నారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న అయ్యగారి వసంతలక్ష్మి , ప్రఖ్యాత రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి రాసిన ‘సుఖాంతం’ కథను వినిపించారు.

ప్రముఖ కథారచయిత విహారి ‘కాలానుగుణ’ అంశాలు అనే అంశంపై ప్రసంగిస్తూ రచయితలు కథాంశాన్ని ఎంచుకునేటప్పుడు అది ఆ తరాన్ని ఆకట్టుకునే విధంగా ఉండాలన్నారు. సుప్రసిద్ధ కథారచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు తాను చిన్నప్పటి నుంచే కథలు వినడం, అనేకమంది సాహితీవేత్తల సమక్షంలో తన జీవితం గడవడంవల్ల తన కథానేపథ్యం ప్రారంభమైందన్నారు. ఎన్నో కథలపోటీల్లో పాల్గొని శతాధిక బహుమతులు పొందిన సుప్రసిద్ధ రచయిత సింహ ప్రసాద్ మాట్లాడుతూ పోటీలో పాల్గొని బహుమతులు పొందాలంటే ఎంచుకునే కథాంశం మీద ధ్యాస, నియమ నిబంధనలమీద దృష్టి ఉండాలని తెలిపారు. మంచి కథకు ప్రమాణం కేవలం బహుమతి పొందడమే కాదని, బహుమతి పొందని కథల్లో కూడా ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయని గుర్తు చేశారు.

ప్రముఖ హాస్యకథారచయిత్రిగా పేరు సంపాదించుకున్న పొత్తూరి విజయలక్ష్మి తాను రాసిన హాస్యకథలతోపాటు ఎంతోమంది హాస్యకథ రచయితలు రాసిన విషయాలను ప్రస్తావించి సభలో నవ్వులు పూయించారు. ప్రసిద్ధ కథా రచయిత శరత్ చంద్ర మాట్లాడుతూ.. ప్రతి కథ ఒక సామాజిక ప్రయోజనం కలిగి ఉండి, మానవ సంబంధాలను మెరుగుపరచడంలో ముఖ్యభూమికను పోషిస్తూ, మానవీయకోణం కలిగి ఉన్నప్పుడే ఆ కథ పదికాలాల పాటు శాశ్వతంగా నిలుస్తుందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, బాల సాహిత్యంలో శతాధిక రచనలు చేసిన చొక్కాపు వెంకటరమణ మాట్లాడుతూ పిల్లలకు కథలు చెప్పడం చాలా అవసరమని అన్నారు. అవి వారి మానసిక పరిణితికి బాగా ఉపయోగపడతాయన్నారు. ఈ సాహిత్యసభలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకు, ప్రసారం చేసిన మాధ్యమాలకు, కార్యకర్తలకు, తానా సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసింది. పూర్తికార్యక్రమాన్ని https://youtube.com/live/NwSYNfZI0sI  లింక్‌లో వీక్షించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు