
తానా ఎన్నికల షెడ్యూల్ విడుదల
వాషింగ్టన్: అమెరికాలో తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీని కూడా నియమించారు. ఎన్నికల కమిటీ చైర్మన్‌గా కనకం బాబు ఇనంపూడి, సభ్యులుగా ఆంజనేయులు కోనేరు, రాజా ముత్యాల వ్యవహరించనున్నట్టు బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ తెలిపారు.
తానా ఎన్నికల షెడ్యూల్ ఇలా..
ఈ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 31న విడుదల కాగా.. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ ఫిబ్రవరి 13గా నిర్ణయించారు. ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 22 కాగా.. ఫిబ్రవరి 25న నామినేషన్ల తుది జాబితా విడుదల చేస్తారు. మార్చి 1న తానా వెబ్సైట్లో అభ్యర్థుల వివరాలు, బ్యాలెట్ మెయిలింగ్ యుఎస్పీఎస్ (ఫస్ట్ క్లాస్) మార్చి 22, బ్యాలెట్ స్వీకరణకు తుది గడువు మే 14గా నిర్ణయించారు. మే 15న ఓట్ల లెక్కింపు, మే 16న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉంటుంది.
ఫీజుల చెల్లింపు ఎంతంటే?
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే అభ్యర్థుల నామినేషన్ ఫీజుగా 5,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. రీజినల్ రిప్రజెంటేటివ్ పదవులకు పోటీ పడే అభ్యర్థులు 1,500 డాలర్లు చెల్లించాలి. ఇతర పదవులకు పోటీ చేసేవాళ్ళు 2,500 డాలర్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్నికల కమిటీ ఎవరి నామినేషన్‌ను అయినా తిరస్కరిస్తే ఆ అభ్యర్థికి పూర్తి సొమ్మును తిరిగి చెల్లిస్తారు. అభ్యర్థే స్వయంగా నామినేషన్‌ను ఉపసంహరించుకుంటే 50శాతం నామినేషన్ ఫీజును వాపస్ చేస్తారు.
ఈ పదవులకే పోటీలు
బోర్డ్ డైరెక్టర్ పదవులకు సంబంధించి 3 పదవులకు ఓపెన్ కేటగిరీ కింద ఎన్నికలు జరుగుతాయి. ఈ పదవుల్లో గెలిచినవాళ్ళు 4 ఏళ్ల పాటు (2021-2025 వరకు) పదవుల్లో కొనసాగవచ్చు. నాన్ డోనర్ డైరెక్టర్ (2 పోస్టులు), డోనర్ డైరెక్టర్ (ఒక పోస్టు)లకు ఎన్నికలు జరుగుతాయి.
ఎగ్జిక్యూటివ్ కమిటీ పోస్టులకు సంబంధించి 20 ఓపెన్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. వీరు రెండేళ్ల పాటు (2021-2023) పదవుల్లో ఉండవచ్చు.
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, జాయింట్ ట్రెజరర్, కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్, కల్చరల్ సర్వీస్ కో ఆర్డినేటర్, ఉమెన్ సర్వీస్ కో ఆర్డినేటర్, కౌన్సిలర్ ఎట్ లార్జ్, ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
రీజినల్ రిప్రజెంటేటివ్ పోస్టులకు సంబంధించి న్యూ ఇంగ్లాండ్, న్యూయార్క్, న్యూజెర్సీ, మిడ్ అట్లాంటిక్, క్యాపిటల్, అప్పలాచియాన్, సౌత్ ఈస్ట్, నార్త్, ఒహైయో వ్యాలీ, మిడ్ వెస్ట్, సౌత్ సెంట్రల్, డీఎఫ్‌డబ్ల్యు, సౌత్‌వెస్ట్, నార్త్ సెంట్రల్, సదరన్ కాలిఫోర్నియా, నార్తర్న్ కాలిఫోర్నియా, నార్త్ వెస్ట్, రాకీ మౌంటెన్స్ ఏరియా పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి.
తానా ఫౌండేషన్‌కు సంబంధించి 7 ఓపెన్ పోస్టులు ఉన్నాయి. (2021-2025 వరకు ఈ పదవుల్లో కొనసాగవచ్చు), ఫౌండేషన్ ట్రస్టీ - 5 పదవులు (4 ఏళ్ల పదవీకాలం), ఫౌండేషన్ డోనర్ ట్రస్టీ 2 పదవులు (4 ఏళ్ల పదవీ కాలం). ఎన్నికలకు సంబంధించి ఇతర సమాచారం కోసం కమిటీని ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.