Updated : 01/03/2021 16:53 IST

ఘనంగా ‘భక్త పోతన సాహిత్య వైభవం’ హరికథా గానం

ఇంటర్నెట్‌ డెస్క్‌: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న 10వ సాహిత్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ హరికథా భాగవతార్ డాక్టర్‌ ముప్పవరపు వేంకట సింహాచల శాస్త్రి భక్త పోతన సాహిత్య వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్ ప్రారంభోపన్యాసం చేశారు. బమ్మెర పోతన తెలుగు సాహిత్యానికి దొరికిన వెలకట్టలేని సహజ కవి రత్నమని,  ఆయన తెలుగు నేలపై పుట్టడం మనం చేసుకున్న అదృష్టమన్నారు. పోతన కవితాశైలి అనన్య సామాన్యం, భావుకత అనితరసాధ్యమని కొనియాడారు. బాల రసాల సాల నవ కోమల కావ్యకన్యకన్ కూలల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటే హాలికులైననేమి’ అంటూ సహృదయ సీమలను అక్షర హలాలతో దున్ని, భక్తి భావాలు అనే బీజాలు నాటి, తెలుగు నేలపై ఆధ్యాత్మికత అనే బంగారు పంటలు పండించిన కవన కృషీవలుడు పోతనేనన్నారు.

‘మందార మకరంద మాధుర్యమున దేలు’, ‘నల్లని వాడు పద్మనయనంబులవాడు’, ‘ఇంతింతై వటుడింతై’, ‘రవిబింబంబుపమింప’, ‘సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి’, ‘ఇందుగలడందులేడని సందేహము వలదు’ లాంటి అమృత గుళికలు లాంటి పద్యాలు ఒకటా.. రెండా వేలాదిగా రాసిన కవి పోతన అని, అలాంటి పద్యం ఒకటైనా వినని, నోటికి రాని తెలుగువారు ఉండరనడం అతిశయోక్తి కాదని వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అన్నారు.

‘హరికథ’ తెలుగు సంస్కృతిలో పేరెన్నికగన్న ఒక గొప్ప ప్రాచీన కళా ప్రక్రియ అని, ఆధునిక కాలంలో హరికథలను  ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన వారు మాత్రం - సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, అరబ్‌‌, పార్శి భాషల్లో మహా పాండిత్యం ఉన్న ఆదిభట్ల నారాయణదాసేనని తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర అన్నారు. ఒకే భాగవతుడు ఆంగిక, వాచిక, సంగీత, సాహిత్య సమ్మేళనంగా ఏకకాలంలో ప్రదర్శించే ఈ ప్రక్రియ మన పురాణ ఇతిహాసాలలో దాగి ఉన్న భక్తిని, జ్ఞానాన్ని జనరంజకంగా ఆవిష్కరించగల శక్తి కలిగిన కళ అని తెలిపారు. ఇటువంటి మన అరుదైన గొప్ప కళా ప్రక్రియలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

తెలుగు సాహితీ వినీలాకాశంలో హరికథా వైభవం గురించి డాక్టర్‌ సింహాచల శాస్త్రి వివరించారు. ఆధునిక హరికథకు ఆద్యులు ఆదిభట్ల నారాయణదాసు గారని, ఇతర భాషల్లో ఉన్నఈ ప్రక్రియ కంటే తెలుగు భాషలోని హరికథ విశిష్టమైనదన్నారు. ఇలాంటి కళను పరిరక్షిస్తున్న తానా వారికి అభినందనలు తెలిపారు.

పోతన బాల్యంనుంచి ఒక మహా కవిగా ఎదిగిన తీరును, భక్త పోతన రచించిన పద్యాలను అద్భుతంగా గానం చేస్తూ, ఆసక్తికరమైన వ్యాఖ్యానాలతో, హాస్య చతురోక్తులతో అద్భుతంగా రెండు గంటల పాటు వీనుల విందుగా ఈ కార్యక్రమం వీక్షకులను అలరించింది. భక్త పోతనామాత్యుడి సాహిత్యాన్ని అద్భుతంగా, రాగయుక్తంగా, రసమయంగా ఆవిష్కరించిన ‘వాచస్పతి’, ‘హరికథా చూడామణి’, ‘సంగీత సాహిత్య భూషణ’ భాగవతార్ డాక్టర్‌ ముప్పవరపు వేంకట సింహాచలశాస్త్రి, మరియు వాయులీన సహకారం అందించిన లోల్ల జయరాం, మృదంగ సహకారం అందించిన కోటిపల్లి రమేశ్‌కు, ఈ కార్యక్రమ విజయానికి కృషి చేసిన సభ్యులందరికీ, వివిధ ప్రసార మాధ్యమాలకు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర ధన్యవాదాలు తెలిపారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని