Published : 25 Aug 2021 19:07 IST

తెలుగు భాషా దినోత్సవానికి ‘తానా’ స్పెషల్‌ ఈవెంట్‌

 ప్రఖ్యాత సాహితీవేత్తల కుటుంబ సభ్యులతో రెండ్రోజుల ప్రత్యేక కార్యక్రమం

అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి జయంతి (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించనున్నట్టు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు వెల్లడించారు. శని, ఆదివారాల్లో (ఆగస్టు 28, 29) రెండు రోజుల పాటు వర్చువల్‌ పద్ధతిలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. శనివారం జరిగే కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ మహిళా, శిశు అభివృద్ధి,  సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న తెలుగు సంతతికి చెందిన డా. శశి పిల్లలమర్రి (పంజా) ముఖ్య అతిథిగా, బెంగాల్‌లో డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ (డీజీపీ)గా  సేవలందిస్తున్న మరో తెలుగు తేజం డా. బొప్పూడి నాగ రమేశ్ ప్రత్యేక అతిథిగా,  ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి విశిష్ఠ అతిథిగా పాల్గొంటారని తెలిపారు. భరణి రచించిన “ఎందరో మహానుభావులు” గ్రంథాన్ని సత్య భావన ఆంగ్లంలోకి అనువదించగా.. ఆ పుస్తకాన్ని డాక్టర్‌ పంజా ఆవిష్కరిస్తారన్నారు. ఆదివారం జరిగే కార్యక్రమానికి “ప్రసారభారతి” సీఈవో శశి శేఖర్ వెంపటి, దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీ కరణం మల్లీశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. 

ఎంతోమంది లబ్ధప్రతిష్టులైన సాహితీవేత్తల జీవిత ప్రస్థానాలను ఈ సభలో వారి కుటుంబ సభ్యులే ఆవిష్కరించడం సాహితీ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం కానుందని తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అన్నారు. శనివారం డా. తుమ్మల సీతారామమూర్తి చౌదరి, డా. రాయప్రోలు సుబ్బారావు, డా. కొండవీటి వేంకట కవి, డా. ముళ్ళపూడి వెంకటరమణ, డా. గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మర్షి డా. ఉమర్ అలీషా, పద్మభూషణ్ డా. గుర్రం జాషువా, పద్మభూషణ్ డా. దేవులపల్లి కృష్ణశాస్త్రి కుటుంబ సభ్యులు పాల్గొంటారని, అలాగే, ఆదివారం రోజు కార్యక్రమంలో కళాప్రపూర్ణ గిడుగు వేంకట రామమూర్తి, పద్మభూషణ్ డా. బోయి భీమన్న, గురజాడ అప్పారావు, రాష్ట్రేందు డా. గుంటూరు శేషేంద్రశర్మ, పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు, పద్మభూషణ్ డా. విశ్వనాథ సత్యనారాయణ, డా. రావూరి భరద్వాజ, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, దేవరకొండ బాలగంగాధర తిలక్ కుటుంబ సభ్యులు పాల్గొని ఎన్నో అసక్తికరమైన విషయాలను పంచుకోనున్నారని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

భారత కాలమానం ప్రకారం ఈ కార్యక్రమం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుందని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌ తెలిపారు. కార్యక్రమాన్ని ఈ కింది మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చన్నారు. మరిన్ని వివరాలు www.tana.orgలో తెలుసుకోవచ్చని చెప్పారు. 

1. TANA TV Channel – in YuppTV; 2. https://www.facebook.com/tana.org; 3. https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw; 4. www.youtube.com/tvasiatelugu; 5. www.youtube.com/manatv

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని