ఆసక్తికరంగా టాంటెక్స్‌ 176వ సాహితీ సదస్సు

ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌ TANTEX) ఆధ్వర్యంలో 175వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా 

Updated : 22 Mar 2022 20:28 IST

డాలస్‌: ఉత్తర తెలుగు సంఘం (టాంటెక్స్‌ TANTEX) ఆధ్వర్యంలో 176వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. ఈ నెల 19న ఆన్‌లైన్‌లో జరిగిన 176వ నెల నెలా తెలుగు వెన్నెల; 48వ టెక్సస్ తెలుగు సాహితీ సదస్సుకు అనేక మంది సాహితీవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీనివాసులు బసాబత్తిన అందరికీ సాదర స్వాగతం పలికారు. ప్రముఖ రచయిత సత్యం మందపాటి ఈ కార్యక్రమం వివరాలను తెలియజేశారు. చిన్నారులు సాహితీ, సింధూర ప్రయాగ రంగదాస "రాముడుద్భవించాడు" కీర్తన ఆలాపనతో ఈ కార్యక్రమం మొదలైంది.

ఇందులో మొదటి భాగమైన సాహిత్య సమాచారంలో డా.Y.కృష్ణ కుమారి భారతంలో క్రీడలు అంశంపై ప్రసంగించి అందరికీ కొత్త విషయాలు వివరించారు. శాన్ ఆంటోనియోకి చెందిన ప్రసాద్ తుర్లపాటి "అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య: సంకీర్తన పోకడలు-పరిశీలన" అంశంపై ప్రసంగించి వారి కీర్తనలను గుర్తుచేశారు.  నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో భాగంగా “మనతెలుగు సిరి సంపదలు” ధారావాహికలో ఊరిమిండి నరసింహారెడ్డి  తెలుగు భాషలోని పొడుపు కథలు, జాతీయాల్లో ప్రశ్నలువేసి అందరినీ ఆకట్టుకున్నారు. డాలస్‌కు చెందిన లెనిన్ వేముల "వసంత కాలంపై రాసిన కవితలు, గేయాలు" గురించి చక్కగా ప్రసంగించారు. ఆస్టిన్‌కి చెందిన ఇర్షాద్ స్టాండ్ అప్‌ కామెడీ చేసి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. హరి మద్దూరి "యుగయుగాల కథ" అంశంపై ప్రసంగించి సైన్సులో విషయాలను పురాణాలతో పోలుస్తూ అందరినీ ఆశ్చర్యం నింపారు. 

రెండో భాగంలో ప్రముఖ రచయితలు సత్యం మందపాటి, రాము డొక్కా, ఫణి డొక్కా పుస్తకావిష్కరణలు జరిగాయి. హ్యూస్టన్‌కు చెందిన సాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, శ్రీనివాస్ పెండ్యాల.. సత్యం మందపాటి "సత్యాన్వేషణ" పుస్తకానికి ఆవిష్కర్తలుగా వ్యవహరించారు. అనంతరం రాము డొక్కా పద్య సఫారి, ఫణి డొక్కా పలుకు కచేరి కలిపిని "మా ఆఫ్రికా యాత్ర" పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకానికి ఆచార్య ఎన్.సీ.ఎచ్.చక్రవర్తి, సత్యం మందపాటి ఆవిష్కర్తలుగా వ్యవహరించారు. చివరగా మాసానికో మహనీయుడు శీర్షిక కింద అరుణ జ్యోతి ఈ నెలలో గుర్తు చేసుకోవలసిన ప్రముఖ రచయితల గురించి వివరించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి ప్రార్థనా గీతం పాడిన సాహితి, సింధూరతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహితీ అభిమానులకు టాంటెక్స్‌ కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని