బోస్టన్‌లో ఘనంగా తెదేపా మహానాడు.. ప్రవాసులనుద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు

అమెరికాలోని బోస్టన్‌లో తెదేపా మహానాడు అంగరంగ  వైభవంగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమంలో తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొని మాట్లాడారు.

Updated : 22 May 2022 01:05 IST

బోస్టన్‌: అమెరికాలోని బోస్టన్‌లో తెదేపా మహానాడు అంగరంగ  వైభవంగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండురోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఏపీకి ఎన్నడూ జరగనంత నష్టం జరిగినట్లు చంద్రబాబు విమర్శించారు. 2024లో మళ్లీ తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర పునర్నిర్మాణం జరపాల్సి ఉందని అన్నారు. తెలుగు దేశం అధికారంలోకి రావాలని ప్రజలు ఏకపక్షంగా కోరుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 2200 మందితో బోస్టన్‌లో మహానాడు నిర్వహణ గర్వకారణమని అభినందించారు. తెలుగు దేశం ఆవిర్భావం తరువాతనే తెలుగు ప్రజల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. ఈ రోజు లక్షల మంది ఉన్నత చదువులతో ఐటీ రంగంలో స్థిరపడడానికి నాడు తెలుగు దేశం ప్రభుత్వ తీసుకున్న పాలసీలే కారణం అని చంద్రబాబు తెలిపారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజల వెతలు, వ్యవస్థల విధ్వంసంపై ప్రవాసులతో చంద్రబాబు మాట్లాడారు. జగన్ పాలనతో రాష్ట్రం కోలుకోలేనంతగా నష్టపోయిందన్నారు. పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులను జగన్ ఎలా ధ్వంసం చేశారో ప్రజలు చూశారని విమర్శించారు. తెలంగాణలో కొన్ని కులాలను బీసీల జాబితా నుంచి తొలగిస్తే నోరెత్తని ఆర్. కృష్ణయ్య లాంటి వారికి, తనతో పాటు కేసుల్లో ఉన్నవారికి జగన్ రాజ్యసభ ఇచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. తాను ప్రకటించినట్లు వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. 2024లో తెదేపాను అధికారంలోకి తీసుకురావడంలో ఎన్ఆర్ఐలు తమ వంతు పాత్ర పోషించాలని చంద్రబాబు అన్నారు. 

ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రవాసుల సహకారం అవసరమన్నారు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రవాస తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్రంగా కృషి చేయాలని సూచించారు. ఎన్నారైల సహకారంతో వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రవాసాంధ్రులు తమ ప్రాంతాలకు వచ్చి తెదేపా విజయం కోసం కృషి చేయాలని బుచ్చయ్యచౌదరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ఎన్‌ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి,  వైవీ ప్రభాకర చౌదరి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, నన్నారి నర్సిరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఎన్నారై తెదేపా కన్వీనర్ కోమటి జయరాం నేతలకు స్వాగతం పలికారు. అమెరికా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తెదేపా అభిమానులు, కార్యకర్తలు ఈ మహానాడుకు తరలి వచ్చారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని