దుబాయిలో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం

తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను యూఏఈలో ప్రవాసీయులు ఘనంగా జరుపుకొన్నారు. ఏపీ నుంచి ముఖ్య అతిథిగా తెదేపా...

Published : 21 Mar 2022 22:09 IST

దుబాయి: తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను యూఏఈలో ప్రవాసీయులు ఘనంగా జరుపుకొన్నారు. ఏపీ నుంచి ముఖ్య అతిథిగా తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పాల్గొన్నారు. ‘ఎన్టీఆర్ అమర్ రహే’ అనే నినాదానంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో పలువురు జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ.. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పి, పార్టీ పెట్టిన కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత తెలుగు బిడ్డ, మహా పురుషుడు ఎన్టీఆర్‌కే దక్కిందని కొనియాడారు. నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిన ఏకైక పార్టీ తెదేపా అన్నారు. ఈరోజు రాష్ట్రానికి జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో శని దాపురించిందని విమర్శించారు. జగన్‌ పాలనలో రాష్ట్రం ఇరవయ్యేళ్లు వెనక్కి వెళ్లిందని, దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే విజన్‌ ఉన్న ఏకైక నేత చంద్రబాబును మనమంతా శ్రమించి తెదేపాను అధికారంలోకి తీసుకురావాలని ప్రవాసీయులకు ఈ సందర్భంగా పట్టాభి పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రజలు ఇప్పటికే జగన్ పాలనతో విసిగిపోయారని, రాబోయే ఎన్నికల్లో ప్రవాసీయులు రాష్ట్రంలో కీలకంగా పనిచేయాలన్నారు. విదేశాల్లో ఇప్పటికీ చెక్కుచెదరని కార్యకర్తలు ఉన్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు పరిపాలనపై ఉన్న నమ్మకమే అందుకు కారణమని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రవాసీయులే కీలకం కానున్నారని పట్టాభి చెప్పారు. అనంతరం దుబాయి ఆంధ్ర క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో భారీ కేకు కట్‌ చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు షేక్‌ ఖాదర్‌ బాషా, విశ్వేశ్వరరావు, నిరంజన్‌, వాసు, రవికిరణ్‌, అనురాధ ఓబిలిశెట్టి, జాఫర్‌ అలీ, హరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని