చికాగోలో ఘనంగా ‘ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి’ ఉత్సవాలు.. నాలుగో మినీ మహానాడు

చికాగోలో తెలుగుదేశం పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నాలుగో మినీ మహానాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జయరాం కోమటి అధ్యక్షత వహించారు...

Updated : 06 Sep 2022 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చికాగోలో తెలుగుదేశం పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నాలుగో మినీ మహానాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జయరాం కోమటి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెదేపాని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఎన్టీఆర్ కలలు కన్న అభివృద్ధి, సంక్షేమ రాజ్యం రావాలని ఆకాంక్షించారు. ‘‘చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరంగా ప్రవాసాంధ్రులు భావిస్తున్నారు. ప్రస్తుత పాలకులపై నమ్మకం లేక పెట్టుబడులు ఆగిపోయాయి. అభివృద్ధి కుంటుపడిపోయింది. అమరావతి రాజధానిలో అనేక పరిశ్రమలు స్థాపించేందుకు ప్రవాసాంధ్రులు సిద్ధంగా ఉన్నారు’’ అని తెలిపారు. 

దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ‘‘ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే పెద్దఎత్తున దాడులకు దిగుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే పరిస్థితి నెలకొంది. పేద ప్రజలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను అడ్డుకుంటున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. సీఎం జగన్ రెడ్డి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని కుల, మత, ప్రాంతాలుగా విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రవాసాంధ్రులపై ఉందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

మినీ మహానాడులో పలు తీర్మానాలను ఆమోదించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ మినీ మహానాడులో తీర్మానించారు. ఇటీవల ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణను అభినందించారు. తమ తమ రంగాల్లో బాగా రాణించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఇరువురు ఉన్నత విలువలతో పనిచేసి తమ పదవులకు వన్నెతెచ్చారని కొనియాడారు. కుప్పంలో అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో తెదేపా నేతలపై దాడులను తీవ్రంగా ఖండించారు. ఏపీలో అనైతిక, నగ్న ప్రదర్శనలు ఇస్తున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు. ఈ ఏడాది సభ్యత్వాల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని కోరుతూ తీర్మానించారు. 

ఈ కార్యక్రమాన్ని చికాగో తెదేపా సీనియర్ నాయకులు హేమ కానూరు సమన్వయ పరచగా, స్థానిక తెదేపా నాయకులు రవి కాకర, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, చిరంజీవి గళ్ళ, కృష్ణ మోహన్, శ్రీనివాస్ పెదమల్లు, శ్రీ హరి కట్టా, ప్రవీణ్ వేములపల్లి, మదన్ పాములపాటి, మహేష్ కాకరాల, వినోజ్ చనుమోలు, లక్ష్మణ్ తదితర నాయకులు కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించారు. తెలుగుదేశం అభిమానులు రామ కోటేశ్వర రావు కాట్రగడ్డ, శ్రీలత గరికిపాటి, చాందిని దువ్వూరి, వాసవి చక్క, దేవి ప్రసాద్ పొట్లూరి, యుగంధర్, నగేష్ కాండ్రేగుల తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ జయరాం కోమటి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని