సౌదీలో సిక్కోలు బాధితులకు అండగా నిలిచి ఎంపీ రామ్మోహన్‌నాయుడు, గల్ఫ్‌ తెదేపా

జీవనోపాధి కోసం పొట్టచేతపట్టుకుని సౌదీ అరేబియా వెళ్లి అక్కడ ఇబ్బందుల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసులకు తెదేపా అండగా నిలిచింది. ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవతో కార్మికులు స్వదేశానికి బయల్దేరారు.

Updated : 17 Aug 2023 12:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీవనోపాధి కోసం పొట్టచేతపట్టుకుని సౌదీ అరేబియా వెళ్లి అక్కడ ఇబ్బందుల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసులకు తెదేపా అండగా నిలిచింది. ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవతో కార్మికులు స్వదేశానికి బయల్దేరారు.

వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన 20 మంది వెల్డర్స్‌ గతేడాది సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ ‘ఆల్‌ మురబ్బా’ కాంట్రాక్ట్‌ సంస్థలో వెల్డర్‌ పనుల కోసం చేరారు. ఏడాదిలో వారికి కేవలం నాలుగు నెలలు మాత్రమే వారికి వేతనాలు చెల్లించారు. వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో కార్మికులు విధులకు వెళ్లలేదు. వేతనాలు ఇవ్వని కారణంగా ఆరుగురు స్వదేశానికి వెళ్లిపోగా.. మిగిలిన 14 మంది అక్కడే ఉండిపోయారు. వారు తమకు పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని.. స్వదేశానికి పంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన సదరు సంస్థ పట్టించుకోలేదు. చివరికి భోజనాలకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. 

ఈ నేపథ్యంలో తమ గోడును వెళ్లబోసుకుంటూ అక్కడి కార్మికులు ఇటీవల ఓ వీడియో కాల్‌ ద్వారా తమ బంధువులకు సందేశాన్ని పంపించారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబసభ్యులు తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన ఎంపీ.. గల్ఫ్‌ తెదేపా అధ్యక్షుడు రాధాకృష్ణతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా కార్మికులు స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఎంపీ కలిసి సమస్యను విన్నవించారు. దీంతో విదేశాంగశాఖ అధికారులు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి సిక్కోలు కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లను చేయించారు. దీనిపై బాధితులు స్పందిస్తూ దళారుల చేతుల్లో మోసపోయిన తమకు ఎంపీ రామ్మోహన్‌నాయుడు, గల్ఫ్‌ తెదేపా అధ్యక్షుడు రాధాకృష్ణ, సౌదీ అరేబియా తెదేపా అధ్యక్షుడు ఖాలిద్‌ సైఫుల్లా చేసిన మేలు మర్చిపోలేమని ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని