తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఉత్సాహంగా “తెలంగాణ భాషా దినోత్సవం”

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా .....

Published : 10 Sep 2021 19:06 IST

అట్లాంటా, జార్జియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా “తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు” ఉత్సాహంగా జరిగాయి. సెప్టెంబర్ 9న అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాల దృశ్య సమావేశంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది సాహితీ ప్రముఖులు హాజరయ్యారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక కోసం ప్రముఖ తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన తెలుగు వైభవ గీతాన్ని, ప్రముఖ సంగీత దర్శకులు నేమాని పార్థసారథి స్వరపరచగా, మధుర గాయకులు ఎస్.పి.బాలు గానం చేసిన ప్రత్యేక దృశ్య గీతంతో సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త కాళోజీకి తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు ఘన నివాళులర్పించారు. తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను జరుపుకొంటున్న భాషాభిమానులందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అతిథులకు ఘనస్వాగతం పలికి సభను ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భాషా దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకొంటున్న తరుణంలో పర దేశంలో ఉన్నప్పటికీ తల్లిభాష పట్ల మమకారంతో అంతర్జాల మాధ్యమంలో వైవిధ్య భరితంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం విశేషమన్నారు. అనంతరం తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో రచయితగా ప్రఖ్యాతి గాంచిన కవి, సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహాన్ని తన రచనలలో పొందుపరచి, నిజాం ప్రభుత్వ దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా తన కలాన్ని ఎత్తి, గళాన్ని విన్పించి, పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించిన స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కాళోజీ నారాయణ రావు జయంతిని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ముదావహమన్నారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డా. కె. వి. రమణాచారి అందరికీ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తానా చేస్తోన్న భాషా సేవకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు భాష కోసం, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌ అన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ నూకల వేణుధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో జన్మించిన సాహితీవేత్తలను గుర్తుచేసుకుంటూ ప్రజలందరికీ భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. మాజీ ప్రధాని పి. వి. నరసింహారావు కుమార్తె ప్రముఖ విద్యావేత్త, చిత్రకారిణి, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి సైతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ నేపథ్యంతో పాటు పీవీ రాజకీయ ప్రస్థానాన్ని, సాహిత్యాభిలాషను, స్నేహితులతో ఆయన మెలిగిన తీరును ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పలువురు విశిష్ట సాహితీవేత్తలైన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పత్రికా సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు సురవరం కృష్ణ వర్దన్‌, ప్రజాకవి సుద్దాల హనుమంతు తనయుడు సుద్ధాల అశోక్‌ తేజ, ప్రముఖ కవయిత్రి డా. పాకాల యశోదా రెడ్డి కుమార్తె డా. లక్ష్మీ పాకాల, ప్రముఖ కవి డా.పల్లా దుర్గయ్య కుమారులు డా. పల్లా రత్నాకర్‌, డా. పల్లా శ్యామసుందర్‌, పద్మభూషణ్‌ సినారె మనవడు సందడి లయ చరణ్‌, దాశరథి రంగాచార్య కుటుంబం తరఫున మడిపల్లి దక్షిణామూర్తి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ గడ్డపై జన్మించిన ఎంతోమంది లబ్ధ ప్రతిష్టులైన విశిష్ట సాహితీవేత్తలను, ఆనాటి సామాజిక పరిస్థితులు, వారి జీవన విధానం, సహ రచయితలతో వారి అనుబంధం, వారి సాహిత్య సృష్టి తదితర ఎన్నో పుస్తకాల్లో లభ్యం కాని ఆసక్తికర విషయాలను ఈ సభలో వారి కుటుంబ సభ్యులే పాల్గొని పంచుకోవడం సాహిత్య చరిత్రలోనే సరికొత్త కోణం అని డా. తోటకూర ప్రసాద్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని