హాంకాంగ్‌లో ఘనంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు

ఈతరం పిల్లలకు తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు సంస్కృతిని తెలియజేసేందుకు ‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ ప్రతి ఏడాది జనవరిలో చిన్నారులతో భోగి, తెలుగు సాంస్కృతిక ...

Updated : 25 Jan 2022 23:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈతరం పిల్లలకు తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు సంస్కృతిని తెలియజేసేందుకు ‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ ప్రతి ఏడాది జనవరిలో చిన్నారులతో భోగి, తెలుగు సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్‌ నిబంధనల కారణంగా భోగి వేడుకలను సామూహికంగా నిర్వహించలేదు. తెలుగు సాంస్కృతిక ఉత్సవాలను జూమ్ యాప్‌ ద్వారా నిర్వహించామని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి తెలిపారు. తెలుగు సాంస్కృతిక ఉత్సవాలను హాంకాంగ్‌లో ఎన్‌ఆర్‌ఐ తెలుగు ఐడల్ 2021 రన్నరప్‌ హర్షిణి పచ్చంటి తన ప్రార్థన గీతంతో ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరూ సంప్రదాయ దుస్తులు ధరించారు. కొందరు చిన్నారులు శాస్త్రీయ సంగీతం, సినిమా పాటలు పాడారు. మరికొందరు చిన్నారులు నృత్యాలు చేశారు. శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా త్యాగరాజును, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను స్మరించుకుని నివాళులర్పించారు.  

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ సుజాత గోవాడ మాట్లాడుతూ.. పిల్లల నృత్య ప్రదర్శనలు ఎంతో ముచ్చటగా ఉన్నాయని, వారి ఉత్సాహం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. హాంకాంగ్‌లో తెలుగువారందరిని ఒకే తాటిపై తీసుకొచ్చి తెలుగు భాష, సంస్కృతికి ‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ చేస్తున్న కృషిని కొనియాడారు. మరో స్థానిక విశిష్ట అతిథి, టాలీవుడ్ దర్శకుడు కిషోర్ మాట్లాడుతూ.. సాంస్కృతిక కార్యక్రమాలను మెచ్చుకున్నారు. తెలుగు సమాఖ్య హాంకాంగ్‌లోని తెలుగు వారిని వివిధ కార్యక్రమాల ద్వారా కలిపే ప్రయత్నాన్ని అభినందించారు. ఉత్సవాలు విజయవంతానికి కృషి చేసిన పిల్లలను, వారి తల్లిదండ్రులకు ‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ సాంస్కృతిక కార్యదర్శి సువర్ణ చుండూరు, ఉప కోశాధికారి రమాదేవి సారంగా, ఆర్థిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, జనరల్ సెక్రటరీ గర్దాస్ జ్ఞానేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛందంగా సేవలు అందించిన అపర్ణ కందా, రాజీవ్ ఈయున్ని తదితరులను జయ పీసపాటి అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని