TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషాదినోత్సవ వేడుకలు

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషాదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని........

Updated : 30 Aug 2022 00:32 IST

డాలస్, టెక్సాస్: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషాదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 29న తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘తెలుగు భాష, సాహిత్య వికాసాలకై-మహిళా సంస్థల కృషి’ అనే అంశంపై ఓ ప్రత్యేక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెలా ఆఖరి ఆదివారం ‘నెల నెలా తెలుగు వెలుగు’ పేరిట జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఇది 38వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం.

తానా సంస్థ అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి  సమావేశ ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రతిఒక్కరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకుడు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఉగ్గుపాలతో పసిపిల్లలకు మాతృభాష నేర్పే తొలి గురువు తల్లి అని, తెలుగు భాషా పరిరక్షణలో స్త్రీలు ముందుండాలని కోరారు. 14 మహిళా సంస్థల ప్రతినిధులు ఈ వేదికపై పాల్గొనడాన్ని ప్రశంసిస్తూ.. సాహిత్య చరిత్రలో ఇదో అపూర్వ ఘట్టమని కొనియాడారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ముగింపు సందేశమిచ్చారు.

విశిష్ట అతిథులుగా డా.కె.ఎన్.మల్లీశ్వరి-ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, వోల్గా-అస్మిత, కొండవీటి సత్యవతి-స్త్రీవాద పత్రిక భూమిక, అనిశెట్టి రజిత-రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక, రమాదేవి-ఐద్వా, గంటి భానుమతి-లేఖిని పాల్గొన్నారు. తేళ్ళ అరుణ-నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం), పి.జ్యోతి-స్ప్రెడింగ్ లైట్, వలబోజు జ్యోతి-జె.వి ప్రచురణలు, అత్తలూరి విజయలక్ష్మి-సరసిజ థియేటర్‌ ఫర్ ఉమెన్, జ్వలిత-కథయిత్రుల సమూహం, కొండేపూడి నిర్మల-సంతకం సాహిత్య వేదిక, ఆచార్య కాత్యాయనీ విద్మహే-స్త్రీజనాభ్యుదయ అధ్యయన సంస్థ పాలుపంచుకొన్నారు. వీరితోపాటు మహిళా సాహిత్య, చైతన్య సాంస్కృతిక సంస్థలు పాల్గొన్నాయి. ఈ పూర్తి కార్యక్రమన్ని https://youtu.be/Bz6lI-8zJaw యూట్యూబ్‌ లింక్‌లో చూడవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని