Gun Fire: అమెరికాలో కాల్పులు.. బాలింత, శిశువు సహా 11మంది మృతి

అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఫ్లోరిడా నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు.

Updated : 06 Sep 2021 08:27 IST

ఫ్లోరిడా/హూస్టన్‌/వాషింగ్టన్‌: అమెరికాలో తుపాకీ సంస్కృతి ప్రాణాలు తోడేస్తోంది. శని, ఆదివారాల్లో మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 11 మంది మృతిచెందారు. ఫ్లోరిడాలోని లేక్‌ ల్యాండ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ సైకో తుపాకీతో స్వైరవిహారం చేయడంతో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ బాలింత, ఆమె ఒడిలో ఒదిగిన శిశువు కూడా ఉన్నారు. బుల్లెట్‌ప్రూఫ్‌ దుస్తులు ధరించిన సైకో జరిపిన కాల్పుల్లో లేక్‌ల్యాండ్‌లోని ఓ ఇంట్లో 11 ఏళ్ల బాలిక, బాలింత, ఆమె ఒడిలోని శిశువు మృతిచెందారు. పొరుగింట్లో మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆగంతుకుడిపై కాల్పులు జరిపిన పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చేర్చారు. అయితే కాల్పులకు కారణం ఏమిటన్నది పోలీసులు వెల్లడించలేదు.

హూస్టన్‌లో నలుగురు

 హూస్టన్‌లో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతిచెందారు. కాల్పుల అనంతరం ఆ ఇల్లు తగలబడింది. అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మృతదేహాలను గుర్తించగా, కాల్పుల విషయం వెలుగుచూసింది. మృతుల్లో ఇద్దరు పెద్దలకు సుమారు 50 ఏళ్లు ఉండగా, పిల్లల వయసు 10-13 మధ్యలో ఉంటుందని పోలీసులు చెప్పారు. ఇంట్లో జరిగిన గొడవే కాల్పులకు దారి తీసి ఉండొచ్చని భావిస్తున్నారు.

వాషింగ్టన్‌లో ముగ్గురు

అమెరికాలోని వాషింగ్టన్‌ వాయవ్య ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసుశాఖ ట్విటరులో పేర్కొన్న సమాచారం మేరకు.. లాంగ్‌ఫెలో వీధిలోని 600 బ్లాకులో బ్రైట్‌వుడ్‌ పార్కు సమీపాన ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులకు స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. వీరికి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కాల్పులకు సంబంధించి నల్లటి హోండా అకార్డ్‌ సెడాన్‌ వాహన చిత్రాన్ని ట్విటరులో ఉంచిన పోలీసు శాఖ.. దీన్ని గుర్తించడంలో స్థానికుల సాయం కోరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని