Jayaram komati: ఇంత నీచంగా మాట్లాడ‌తారా? - ఖండించిన ఎన్నారై తెదేపా నేత జయరాం కోమటి

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతుంద‌ని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నీచ‌మైన వ్యాఖ్యలు చేయ‌డ‌మే

Updated : 21 Nov 2021 11:32 IST

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతుంద‌ని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నీచ‌మైన వ్యాఖ్యలు చేయ‌డ‌మే అందుకు నిదర్శనమని ఎన్నారై తెదేపా నేత 'జయరాం కోమటి' అన్నారు. రాష్ట్ర శాస‌న స‌భ‌లో చంద్రబాబుపై, ఆయ‌న సతీమణిపై వైకాపా నాయ‌కులు చేసిన దారుణ‌మైన వ్యాఖ్యలను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. అధికారం ఉంది క‌దా అని ఎలా ప‌డితే అలా మాట్లాడితే ఊరుకునేది లేద‌ని హెచ్చరించారు. అధికార ప్రభుత్వ తీరును తప్పుప‌ట్టారు.

అసెంబ్లీలో త‌న భార్యపై వైకాపా నాయ‌కులు నీచ‌మైన వ్యాఖ్యలు చేశార‌నే ఆవేద‌న‌తో స‌భ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన బాబు.. ఆ త‌ర్వాత ప్రెస్‌మీట్లో మాట్లాడుతూ క‌న్నీటిప‌ర్యంత‌మైన విష‌యం తెలిసిందే. ఎన్నాడూ బాబును అలా చూడ‌ని తెలుగు దేశం పార్టీ నాయ‌కులు, కార్యకర్తలు తీవ్రంగా బాధ‌ప‌డ్డారు. వైకాపా నాయ‌కుల తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నారై తెదేపా నేత‌గా జ‌య‌రాం కూడా వైకాపా నేతల వ్యాఖ్యలను ఖండించారు. రాజ‌కీయ నాయ‌కుల్లో హుందాతనం ఉండాల‌ని.. కానీ ఇలా మాట‌ల‌తో బ‌రితెగించ‌డం స‌రికాదంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాజ‌కీయాల‌ను వ్యక్తిగత జీవితానికి ముడిపెడుతూ కుటుంబ స‌భ్యుల‌ను మాట‌ల‌న‌డం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాద‌ని విచారం వ్యక్తం చేశారు. వైకాపా నాయ‌కుల‌కు కూడా కుటుంబాలు ఉన్నాయ‌ని.. వాళ్లకూ కుటుంబ స‌భ్యులు ఉన్నారని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తుచేశారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప‌ని చేసిన ప్రజా నేతను ఇలాంటి మాట‌ల‌తో బాధ పెట్టడాన్ని త‌ప్పుప‌ట్టారు. ప్రజలన్నీ చూస్తున్నార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా అధికార అహంకారంతో ఉన్న వైకాపాకు బుద్ధి చెబుతార‌ని ఆయ‌న హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు