అమెరికాలో అవకాశాలెన్నో..

అమెరికాలో విద్య కేవలం డబ్బు ఉన్న వారికే కాదు, పేదలు కూడా చదువుకునే వీలుందని ఏపీ ప్రభుత్వ విదేశీ విద్య సలహాదారు డా.కుమార్‌ అన్నవరపు అన్నారు. కేవలం చదువుకోవాలన్న తపన ఉంటే చాలన్నారు. అక్కడ ఆకాశమే హద్దు అన్నట్లుగా

Published : 06 Oct 2021 16:05 IST

కష్టపడే తత్వముంటే పేదరికం అడ్డుకాదు

మాస్టర్స్‌ డిగ్రీకి వెళ్తే ఖర్చు తగ్గుతుంది

రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య సలహాదారు కుమార్‌

అమెరికాలో విద్య కేవలం డబ్బు ఉన్న వారికే కాదు, పేదలు కూడా చదువుకునే వీలుందని ఏపీ ప్రభుత్వ విదేశీ విద్య సలహాదారు డా.కుమార్‌ అన్నవరపు అన్నారు. కేవలం చదువుకోవాలన్న తపన ఉంటే చాలన్నారు. అక్కడ ఆకాశమే హద్దు అన్నట్లుగా అవకాశాలు ఉంటాయని వివరించారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ‘అమెరికాలో ఉన్నత విద్యపై ఇష్టాగోష్టి’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన దేశంలో విద్యను సేవగా పరిగణిస్తారు. కానీ అభివృద్ధి చెందిన అమెరికాలో ఇందుకు విరుద్ధం. అక్కడ చదువు అనేది వ్యాపారం. దీనిని ఒక పరిశ్రమగా చూస్తారు. చదువు పూర్తి అయి, తమ కాళ్లపై తాము నిలబడిన తర్వాత ఆ విశ్వవిద్యాలయానికి విరాళం ఇవ్వడం అక్కడి సంప్రదాయం. అందుకే అక్కడి వర్శిటీలు అన్నీ స్వయం సమృద్ధి సాధిస్తాయి. ఫలితంగా వాటికి నిధుల సమస్య అనేది తలెత్తదు. ఆ దేశంలో సుమారు 4,800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ వంద వర్శిటీల్లో 30 శాతం అమెరికాలోనే ఉన్నాయి. 

బ్యాచ్‌లర్స్‌ డిగ్రీ ఇక్కడ చదివి మాస్టర్స్‌ కోసం అమెరికా వెళ్తే నయమా? లేక ప్లస్‌ టూ చదివి అక్కడే బ్యాచ్‌లర్స్‌ డిగ్రీ చేరడం మంచిదా?

జ : అమెరికాలో బ్యాచిలర్స్‌ డిగ్రీ చదువుకునే వారే అధికం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. మొదటి రెండేళ్లు మనమే భరించాలి. రెండేళ్లకు కలిపి దాదాపు లక్ష డాలర్లు అవుతుంది. ఉపకార వేతనాలు కేవలం స్థానికులకే ఇస్తారు. గ్రాడ్యుయేషన్‌ భారత్‌లో పూర్తి చేసి మాస్టర్స్‌ చదివేందుకు వెళ్తే ఉత్తమం. అమెరికాలో బ్యాచ్‌లర్స్‌ డిగ్రీ చదవాలనుకునే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ విధానంపై కసరత్తు చేస్తోంది.  

ఒకే చోట వద్దు..
మన తెలుగు విద్యార్థులు బృందాలుగా వెళ్లి అందరూ ఒకే యూనివర్శిటీలో చేరుతున్నారు. దీని వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. వాటిల్లో ఉండే తక్కువ ఫెలోషిప్స్‌కు బాగా పోటీ పడాల్సి వస్తోంది. మిగిలిన వారంతా అధిక ఫీజులు కట్టాల్సి వస్తుంది. దీని కంటే వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో చేరితే బాగుంటుంది. ఆ దేశంలో చాలా రకాల యూనివర్శిటీలు ఉన్నాయి. ఎవరికి వారు అక్కడి కోర్సులు, వర్శిటీలపై అవగాహన పెంచుకోవడం అవసరం. అంతేకానీ గుడ్డిగా కన్సల్టెన్సీలు చెప్పింది విని నిర్ణయం తీసుకోకూడదన్నారు. కార్యక్రమంలో ఏజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు చావా రవి, ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గ సభ్యుడు చలపతిరావు, తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు తమ సందేహాలను కుమార్‌ ముందు ఉంచి, సమాధానాలు రాబట్టారు. 

ప్రశ్న: పేద విద్యార్థులు అమెరికాలో చదవాలంటే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి తోడ్పాటు లభిస్తుంది?

జవాబు: అమెరికాలో ఓ సామాన్య విద్యార్థి చదువుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతి విశ్వవిద్యాలయంలో బిలియన్‌ డాలర్ల నిధి ఉంటుంది. ఫెలోషిప్‌ ఇవ్వడంతో పాటు నిర్వహణ వ్యయాన్ని కూడా ఈ నిధి నుంచే వెచ్చిస్తారు. అక్కడి విశ్వవిద్యాలయాలన్నీ పరిశ్రమలతో అనుసంధానమై ఉంటాయి. అక్కడ చదువుకు బాగా ఖర్చవుతుందన్న  భావన నుంచి బయటకు రావాలి. ఒక్కో విద్యార్థికి రూ.30లక్షల వరకు వ్యయం అవుతుంది. విద్యార్థులు రాసే ఎస్‌వోపీ (స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పజ్‌)లో ఉన్నది ఉన్నట్లు రాయాలి. సులువుగా సీటు వస్తుంది. 

ప్ర : విశ్వవిద్యాలయాల్లో ఫెలోషిప్‌లు ఎలా పొందొచ్చు

జ : అక్కడ ఫెలోషిప్స్‌ చాలా విభిన్నంగా ఉంటాయి. కేఫ్‌టేరియా, గార్డెనింగ్, గ్రంథాలయాలు, తదితర చోట్ల పనిచేయొచ్చు. రెండు ఫెలోషిప్స్‌కు అయితే జీఆర్‌ఈ కానీ ఐఈఎల్‌టీఎస్‌ కానీ అవసరం. కేఫ్‌టేరియాలో పనిసేందుకు ఎటువంటి అర్హతలు అవసరం లేదు. నెలకు గరిష్ఠంగా 40 గంటలు పనిచేయొచ్చు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts