Visa: భారతీయులకు వీసా రుసుముల తగ్గింపు!

తమ దేశానికి వచ్చే భారతీయులకు మరింత చౌకగా, సులభంగా వీసాలు జారీ చేసే యోచనలో బ్రిటన్‌ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 02 Jan 2022 11:03 IST

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం అంగీకరించనున్న బ్రిటన్‌

లండన్‌: తమ దేశానికి వచ్చే భారతీయులకు మరింత చౌకగా, సులభంగా వీసాలు జారీ చేసే యోచనలో బ్రిటన్‌ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా పర్యాటకులు, విద్యార్థులు, వృత్తి నిపుణులకు సంబంధించి పలు నిబంధనలను సడలించవచ్చని సమాచారం. భారత్‌ను స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) ఒప్పించడానికి యూకే ఈ మినహాయింపులను ప్రతిపాదించే అవకాశం ఉందని ది టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ప్రతిపాదిత ఎఫ్‌టీఏపై సంప్రదింపులను ప్రారంభించేందుకు బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి ఆన్‌ మేరీ ట్రెవిల్యాన్‌ ఈ నెలలో దిల్లీని సందర్శించనున్నారు. తమ పౌరులపై విధిస్తున్న పలు వలస నిబంధనలను సడలించాలన్న భారత దేశ చిరకాల డిమాండ్‌ను ఈ సందర్భంగా బ్రిటన్‌ ఆమోదించవచ్చని ఆ పత్రిక అభిప్రాయపడింది. మేరీ ట్రెవిల్యాన్‌ వెంట దిల్లీ వెళ్లనున్న బ్రిటన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి లిజ్‌ ట్రస్‌ కూడా భారత్‌తో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నారు. చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయాలంటే భారత్‌కు మరింత స్నేహ హస్తం అందించాలన్నది లిజ్‌ ట్రస్‌ అభిప్రాయం. పస్తుతం బ్రిటన్‌కు వెళ్లే భారతీయ పౌరుల నుంచి వర్క్‌ వీసా అయితే రూ.1.40లక్షలకు పైగా (1400 పౌండ్లు), విద్యార్థుల వీసా కోసం రూ.35వేలకు పైగా (348 పౌండ్లు), టూరిస్టు వీసాకు రూ.9500కు పైగా (95 పౌండ్లు) రుసుములను వసూలు చేస్తున్నారు. ఇవే వీసాలకు చైనా పౌరుల నుంచి వసూలు చేస్తున్న రుసుములు చాలా తక్కువగా ఉంటున్నాయి. భారతీయుల నుంచి వసూలు చేస్తున్న రుసుములను కూడా తగ్గించాలని భారత సంతతికి చెందిన పలువురు బ్రిటన్‌ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts