అమెరికాలో సిలికానాంధ్ర యూనివర్సిటీ ప్రపంచస్థాయి విద్యా ప్రాంగణం

అమెరికాలో ప్రపంచస్థాయి విద్యాప్రాంగణం నిర్మాణాన్ని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ తలపెట్టింది. శాన్‌వాకిన్‌ పరిధిలోని ట్రేసీ పట్టణం సమీపంలో దీన్ని నిర్మించనున్నారు...

Updated : 15 Sep 2021 19:52 IST

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రపంచస్థాయి విద్యాప్రాంగణం నిర్మాణాన్ని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ తలపెట్టింది. శాన్‌వాకిన్‌ పరిధిలోని ట్రేసీ పట్టణం సమీపంలో దీన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాంగణం నిర్మాణానికి ఎంతో విలువైన 67 ఎకరాల భూమి ఇచ్చేందుకు దాతగా సంధు కుటుంబం ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన సిలికాన్‌ వ్యాలీకి సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఇది రూపొందుతోంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా శాన్‌ వాకిన్‌ పరిధిలోని యువత అనేక రకాలుగా లబ్ధి పొందుతారని సంధు కుటుంబసభ్యులు మైక్ సంధు, మణి సంధు ఆశాభావం వ్యక్తం చేశారు. 

దీనిపై విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్‌ మాట్లాడుతూ అందరి మన్ననలు, సహకారం పొందిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం.. స్థానికంగా, దేశవ్యాప్తంగా విభిన్న రంగాల అభివృద్ధికై సముచితమైన విద్యాబోధన అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  స్థానికంగా ఉండే అట్టడుగు వర్గాల అభివృద్ధికి తోడ్పడుతూ స్పష్టమైన ప్రణాళికతో ఉన్నతస్థాయిలో పరిశోధనాత్మక విద్యను అందించే దిశగా ముందుకెళ్తుందన్నారు. రానున్న ఐదేళ్లలో ప్రాంగణ నిర్మాణంలో సింహ భాగం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ నిర్మాణానికి దాదాపు 450 మిలియన్‌ డాలర్ల (రూ.3,300 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. దాతల సహకారంతో ప్రాంగణం రూపుదిద్దుకోనుందని ఆయన వివరించారు.

ప్రొవోస్ట్‌ చామర్తి రాజు మాట్లాడుతూ శాన్‌ వాకిన్‌ పరిధిలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికై సహాయపడే విద్యా ప్రణాళిక రూపొందిస్తామన్నారు.  ఇంజినీరింగ్‌, మెడికల్, ఫార్మసీ, భాషాశాస్త్రాలు, యోగా, ఆయుర్వేద, సంగీత నృత్య కళలలో BS/MS/MA మరియు Ph.D. డిగ్రీలను అందించే అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయంగా సిలికానాంధ్ర రూపొందబోతోందని తెలిపారు.

ఉన్నతవిద్య అందించే ఈ విశ్వవిద్యాలయం శాన్ వాకిన్ ప్రాంతానికి రావడంపై స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివరాలు https://www.uofsa.edu వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయని ఆ యూనివర్సిటీ టెక్నాలజీ డైరెక్టర్‌ ఫణి మాధవ్‌ కస్తూరి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని