US Student Visa: కరోనా వేళ.. రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు!

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలోనూ అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

Updated : 24 Aug 2021 11:31 IST

భారత్‌లో అమెరికా ఎంబసీ వెల్లడి

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలోనూ అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది (2021) ఇప్పటివరకే దాదాపు 55వేలకు పైగా విద్యార్థులకు వీసా మంజూరు చేశామని చెప్పారు. అంతేకాకుండా ప్రతిరోజు అనుమతి పొందుతున్న వీసాల్లో విద్యార్థులవే ఎక్కువగా ఉంటున్నాయని దిల్లీలోని అమెరికా ఎంబసీ వెల్లడించింది.

‘అమెరికాలో ఉన్నత చదువు అనేది భారత విద్యార్థులకు ఓ ప్రత్యేకమైన అనుభవం. ప్రపంచ దృక్పథాన్ని అలవరచుకోవడంతో పాటు అమూల్యమైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య సంబంధాలను ఇవి మరింత బలోపేతం చేస్తాయి’ అని దిల్లీలోని అమెరికా దౌత్యవేత్త అతుల్‌ కేశప్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్ విజృంభణ కారణంగా వీసా ఇంటర్వ్యూ ప్రక్రియ రెండు నెలలు వాయిదా పడిందన్నారు. మే నెలలో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ జులై నెలలో మొదలుపెట్టామని చెప్పారు. విద్యార్థులకు సెమిస్టర్‌ నష్టం కలుగకుండా ఉండేందుకు వీలైనంత వేగంగా వీసా మంజూరు ప్రక్రియను కొనసాగించామన్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలోనూ భారతీయ విద్యార్థులకు మునుపెన్నడూ లేని విధంగా వీసాలు మంజూరు చేశామన్నారు. ఇందుకోసం అమెరికా విదేశాంగ విభాగ సిబ్బంది చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఈ కృషి ఫలితంగానే రికార్డు స్థాయిలో భారత విద్యార్థులకు వీసాలను మంజూరు చేయగలిగామని అతుల్‌ కేశప్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని