Corona: అగ్రరాజ్యంపై మళ్లీ కరోనా పంజా.. ఒక్కరోజే 88వేల కేసులు

అగ్రరాజ్యం అమెరికాపై కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంతో ఆ మధ్య వైరస్‌ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కన్పించగా..

Updated : 29 Jul 2021 12:03 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాపై కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంతో ఆ మధ్య వైరస్‌ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కన్పించగా.. గత కొన్ని రోజులుగా మహమ్మారి మళ్లీ పడగవిప్పుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. తాజాగా అక్కడ 24 గంటల వ్యవధిలో 88,376 కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. 

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 55శాతానికి మించి కనీసం ఒకడోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అయితే వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. గతవారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే.. అత్యధికంగా అమెరికాలోనే నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కూడా తెలిపింది. జులై 25తో ముగిసిన వారంలో అగ్రరాజ్యంలో 5లక్షలకు పైగా కేసులు వెలుగుచూశాయి. అంతక్రితం వారంతో పోలిస్తే ఇది 131శాతం ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ వారానికి సగటు కొత్త కేసుల సంఖ్య 60వేలకు పైనే ఉంటోంది. జూన్‌ నెలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. 
వ్యాక్సినేషన్‌ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియంట్‌ విస్తృతే తాజా ఉద్ధృతికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అమెరికాలోని పలు రాష్ట్రాలు మళ్లీ కొవిడ్‌ నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి.  అంతకుముందు కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మాస్కు అవసరం లేదని ప్రకటించిన రాష్ట్రాలు, తాజాగా మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశిస్తున్నాయి. ప్రజలు సమూహాలుగా ఏర్పడడాన్ని తగ్గించుకోవాలని పేర్కొంటున్నాయి.

కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రభావితమైన దేశం అమెరికానే. గతేడాది అగ్రరాజ్యాన్ని చిగురుటాకులా వణికించిన మహమ్మారి.. అక్కడ ఇప్పటివరకు 6.12లక్షల మందిని బలితీసుకుంది. దాదాపు 3.5కోట్ల మంది వైరస్‌ బారిన పడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని