America: భారత్‌లో వ్యాపారం సవాలే.. అభిప్రాయం వ్యక్తంచేసిన అగ్రరాజ్యం!

భారత్‌లో వ్యాపారం చేయడం సవాళ్లతో కూడుకున్నదేనని అమెరికా విదేశాంగశాఖ అభిప్రాయపడింది.

Updated : 22 Jul 2021 15:36 IST

సంక్షోభ సమయంలో చర్యలు భేష్‌

వాషింగ్టన్‌: భారత్‌లో వ్యాపారం చేయడం సవాళ్లతో కూడుకున్నదేనని అగ్రరాజ్యం అమెరికా అభిప్రాయపడింది. ఇందుకు ఉన్నతాధికారుల స్థాయిల్లో కొన్ని అడ్డంకులు ఉన్నట్లు పేర్కొంది. అందుచేత ఆకర్షణీయమైన, నమ్మకమైన పెట్టుబడుల వాతావరణాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భారత్‌కు విజ్ఞప్తి చేసింది. ‘2021 పెట్టుబడుల వాతావరణ నివేదిక’లో భారత్‌ గురించి అమెరికా విదేశాంగశాఖ ఈ విధంగా పేర్కొంది.

‘సుంకాల పెంపు, దిగుమతి నిబంధనలపై కొత్తగా చేపడుతున్న రక్షణాత్మక చర్యలు శాస్త్రీయంగా లేవు. అంతేకాకుండా భారత్ పాటిస్తున్న ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంలేదు. ఈ పరిణామాలు అంతర్జాతీయ పంపిణీ వ్యవస్థల నుంచి ఉత్పత్తిదారులను దూరం చేయడమే కాకుండా ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణను అడ్డుకుంటున్నాయి. దీంతో వ్యాపారం చేయడానికి ఒక సవాలుగా ఉన్న ప్రదేశంగా భారత్‌ మిగిలిపోయింది’ అని అమెరికా విదేశాంగశాఖ తాజా నివేదికలో అభిప్రాయపడింది.

సంక్షోభ సమయంలో చర్యలు భేష్‌..

భారత ఆర్థిక వ్యవస్థ - కరోనా వైరస్‌ ప్రభావంతోపాటు ఇతర అంశాలపైనా తాజా నివేదిక స్పందించింది. ముఖ్యంగా కొవిడ్‌ కట్టడికి లాక్‌డౌన్‌ వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సంక్షేమ పథకాలు, ఆర్థిక ఉద్దీపనలను భారత్‌ అమలు చేసిందని కొనియాడింది. అంతేకాకుండా ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేసిందని అభిప్రాయపడింది. ఫార్మా, ఆటోమొబైల్స్‌, టెక్స్‌టైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఇతర రంగాల్లో ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చిందని తెలిపింది. ఈ ఏడాది జనవరి నాటికి భారత జీడీపీ సానుకూల వృద్ధి చెందడానికి ప్రభుత్వ చర్యలు దోహదపడ్డాయని అమెరికా విదేశాంగశాఖ నివేదిక పేర్కొంది.

అవి భారత్‌ అంతర్గత వ్యవహారాలే..

జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి హోదా తొలగింపు, పౌరసత్వ సవరణ చట్టం (CAA)లనూ అమెరికా విదేశాంగ తన నివేదికలో ప్రస్తావించింది. ఎన్‌డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన 100రోజుల నాటికి రెండు వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లోకెక్కిందని తెలిపింది. అయితే, పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమేనని.. అలాంటి సమస్యలపై భారత సార్వభౌమత్వంపై జోక్యం చేసుకునే హక్కు ఏ విదేశీ వ్యవస్థకు లేదని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని