NRI's for Amaravati: అమరావతి ‘మహా పాదయాత్ర’కు ఎన్నారైల సంఘీభావం

ఆంధ్రప్రదేశ్‌లో గత 685 రోజులుగా అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ..

Updated : 01 Nov 2021 15:18 IST

మహా పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొననున్న ఎన్నారైలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 685 రోజులుగా అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు, యువతీ యువకులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అయినప్పటికీ అమరావతిపై జగన్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు రైతులు ‘మహా పాదయాత్ర’కు శ్రీకారం చుట్టారు. అమరావతిలోని తుళ్లూరు నుంచి ప్రారంభమైన ఈ మహా పాదయాత్ర తిరుపతిలో ముగియనుంది. 45 రోజుల పాటు దాదాపు 450 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రకు తెదేపా, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ మహా పాదయాత్రకు ఎన్నారైలు కూడా తమ మద్దతు తెలిపారు. అమెరికాలోని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, తెదేపా ఎన్నారై నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి  రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

ఈ పాదయాత్రలో అమెరికా నుంచి ఎన్నారైలు కూడా వచ్చి ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. ఈ యాత్రకు పూర్తి మద్దతు, సహకారం ఉంటుందన్నారు. అమెరికాలోని ఇండియన్ కాన్సులేట్ అధికారులను ఎన్నారైల బృందం కలవనుందని, అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఎన్నారైల బృందం ఒక లేఖను అధికారులకు అందజేయనున్నట్లు జయరాం కోమటి తెలిపారు. అదేవిధంగా అమరావతి ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

అమరావతి నుంచి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పలు నిరసన కార్యక్రమాలకు గతంలోనూ ఎన్నారైలు అండగా ఉన్నారని, భవిష్యత్తులోనూ మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గత ఏడాది జులై 4వ తేదీన అమరావతి రైతుల ఉద్యమం 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఎన్నారైలు 200 నగరాల్లో ‘ఎన్నారైస్ ఫర్ అమరావతి’ నినాదంతో  నిరసన కార్యక్రమం చేపట్టినట్లు గుర్తు చేశారు. ఈ నిరసనలో అమెరికాతో పాటు పలు దేశాల్లోని ప్రవాసాంధ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. అదే తరహాలో పాదయాత్రలో కూడా భారీ సంఖ్యలో ఎన్నారైలు పాల్గొని రైతులకు మద్దతుగా, అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమం కూడా విజయవంతమవుతుందని జయరాం కోమటి ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని