
తారల రచనలను గుర్తుచేసుకున్న తానా
ఆన్లైన్ ద్వారా సమావేశమైన సాహితీవేత్తలు
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయిన నటులు వారంతా. ఆ నటుల్లోని మరో కోణాన్ని ప్రజల ముందు ఆవిష్కృతం చేసే ప్రయత్నం చేసింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా. ఆయా నటులతో ఆత్మీయ అనుబంధం ఉన్న కవులు, రచయితలతో సాహితీ సమావేశం నిర్వహించింది. అక్కినేని, జగ్గయ్య, గొల్లపూడి వంటి మహామహుల ప్రస్థానాన్ని నెమరువేసుకున్నారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘తారలు-రాతలు’ కార్యక్రమం ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. తెలుగు తెరపై సుప్రసిద్ధ తారలైన పలువురి సాహిత్య ప్రస్థానాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. నటులుగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అక్కినేని నాగేశ్వరరావు, కొంగర జగ్గయ్య, భానుమతి, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ల భరణి రచయితలుగా రాణించిన వైనాన్ని ఆవిష్కరించారు. ఆయా నటులతో ప్రత్యేక అనుబంధం ఉన్న సాహితీవేత్తలు, పాత్రికేయులు ఆన్లైన్ ద్వారా సమావేశంలో పాల్గొని వారి సాహితీ సేవలను వివరించారు. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయ శేఖర్ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదికను తోటకూర ప్రసాద్ నిర్వహించారు.
నటుడు, రచయిత తనికెళ్ల భరణి తన సాహితీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. నాటకాల కోసం రచయితగా మారిన పరిస్థితి, సినిమా రంగ ప్రవేశాన్ని సాహిత్య వేదిక నిర్వాహకులకు వివరించారు. తెలుగు భాషను కాపాడేందుకు తానా సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ప్రముఖ వైద్యురాలు, రచయిత్రి కేవీ కృష్ణకుమారి గుర్తుచేసుకున్నారు. అక్కినేని నటనతోపాటు సాహిత్యంలోనూ సమూన్నత శిఖరమని కొనియాడారు. సాహిత్యం ఉన్నంతకాలం అక్కనేని ఉంటారన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదానికి కొంగర జగ్గయ్య సరైన ఉదాహరణ అని ప్రముఖ కవి రసరాజు అన్నారు. తెలుగు నుడికారం బాగా తెలిసిన కవి జగ్గయ్య అంటూ కొనియాడారు.
తెలుగు ప్రజలకు నటిగా భానుమతి అంటే ఎంత మమకారమో ఆమె రాసిన అత్తగారి కథలన్నా అంతే ప్రేమ అన్నారు ప్రసిద్ధ కవయిత్రి శారదా అశోకవర్ధన్. హాస్య రసానికి అంతగా ప్రాధాన్యం లేని రోజుల్లో ఆ విభాగంలో ఆమె చేసిన కృషి మరువలేనిదన్నారు. గొల్లపూడి మారుతీరావు ఎంత గొప్ప నటుడో అంతకు మించిన రచయిత, నవలాకారుడు అన్నారు ప్రముఖ కవి కిరణ్ ప్రభ. గొల్లపూడి నవలలు చిన్ననాటి నుంచే తనపై ఎంతో ప్రభావం చూపాయన్నారు. తొలి కథ నుంచి చనిపోయే ముందు రాసిన నవల వరకు గొల్లపూడి రచనల్లో పదును తగ్గలేదన్నారు.
ఇవీ చదవండి...
బడ్జెట్ బూస్ట్.. మార్కెట్లు జూమ్
‘హెచ్1బీ’ భాగస్వాములకు బైడెన్ గుడ్ న్యూస్!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.