Tornado: కెంటకీని కుదిపేసిన టోర్నడో

అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టించింది. పెనుగాలులతో కూడిన ఈ తుపాను ధాటికి వేర్వేరు ఘటనల్లో సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆండీ బెషియర్‌ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 200 మైళ్ల మేర పలు కౌంటీలను

Updated : 12 Dec 2021 10:14 IST

ప్రకృతి విలయానికి 70 మంది మృతి

అమెరికాలో ఆరు రాష్ట్రాలపై ప్రభావం

టోర్నడో ధాటికి కెంటకీలోపట్టాలు తప్పిన గూడ్సు రైలు

టెన్నెస్సీ: అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టించింది. పెనుగాలులతో కూడిన ఈ తుపాను ధాటికి వేర్వేరు ఘటనల్లో సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆండీ బెషియర్‌ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 200 మైళ్ల మేర పలు కౌంటీలను బలమైన టోర్నడో చుట్టేసిందని, కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైనదని పేర్కొన్నారు. మృతుల సంఖ్య 100 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

అమెరికాలో టోర్నడో బీభత్సానికి ధ్వంసమైన ఇల్లినోయీలోని అమెజాన్‌ గిడ్డంగి

కొవ్వొత్తుల తయారీ కర్మాగారం పైకప్పు కుప్పకూలటంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు చెప్పారు. ఆ సమయంలో 110 మంది ఆ కర్మాగారంలో ఉన్నారని తెలిపారు. శుక్రవారం రాత్రి అత్యంత దుర్భరమైనదిగా అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. సహాయక చర్యల కోసం 180 మంది సిబ్బందిని రంగంలోకి దించామని, శిథిలాల తొలగింపు కొనసాగుతోందని చెప్పారు. దాదాపు ఐదడుగుల ఎత్తున కర్మాగార శిథిలాల్లో రెండు గంటలకు పైగా చిక్కుకుపోయి సురక్షితంగా బయటపడ్డ ఉద్యోగిని పార్సన్స్‌ పెరెజ్‌ ఆ విషయంలో గ్రేవ్స్‌ కౌంటీ కారాగార ఖైదీలకు కృతజ్ఞతలు తెలిపారు. అవకాశం వచ్చినా పారిపోకుండా వారంతా వచ్చి తనలాంటివారికి సాయపడ్డారని చెప్పారు.

  మేఫీల్డ్‌లో కుప్పకూలిన కొవ్వొత్తుల కర్మాగారం

కెంటకీలోని బౌలింగ్‌ గ్రీన్‌ ప్రాంతంలో అనేక అపార్ట్‌మెంట్లు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని కర్మాగారాలు కూలిపోయాయి. రహదారులపై శిథిలాలు పడి ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. టోర్నడో ప్రభావం ఆరు రాష్ట్రాలపై పడింది. ఇల్లినోయీలో అమెజాన్‌ గిడ్డంగి పైకప్పు ఎగిరిపోయి, భారీ గోడ కూలిపోయింది. అలాస్కాలో ఓ నర్సింగ్‌హోం దెబ్బతింది. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్‌, టెన్నెసీలపైనా టోర్నడో విరుచుకుపడింది. విద్యుత్తు సరఫరా స్తంభించిపోయి దాదాపు 3 లక్షలమంది అంధకారంలో చిక్కుకుపోయారు. అత్యవసరమైతే తప్పిస్తే బయటకు రావద్దని పలుచోట్ల అధికారులు విజ్ఞప్తి చేశారు. దేశాధ్యక్షుడు జో బైడెన్‌ తాజా పరిస్థితిని సమీక్షించారు.


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts