‘టీపాడ్‌’ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ, దసరా వేడుకలు

అమెరికాలోని డాలస్‌లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్‌) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాలస్ పరిధిలోని కొమెరికా సెంటర్ (డాక్టర్ పెప్పర్ ఎరెనా స్టేడియం) వేదికగా వేడుకలను నిర్వహించారు.

Published : 03 Oct 2022 23:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని డాలస్‌లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్‌) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాలస్ పరిధిలోని కొమెరికా సెంటర్ (డాక్టర్ పెప్పర్ ఎరెనా స్టేడియం) వేదికగా వేడుకలను నిర్వహించారు. సుమారు పదిహేను వేల మంది హాజరయ్యారు. పొరుగు రాష్ట్రాలైన ఓక్లహోమా, కాన్సాస్, ఆర్కన్సాస్‌లో ఉంటున్న తెలుగువారు సైతం ఇక్కడికి విచ్చేసి సందడి చేశారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ సుమారు ఐదారువేల మంది మహిళలు, బాలికలు సామూహికంగా పాడుతూ, చప్పట్లు కొడుతూ లయబద్దంగా కదులుతుంటే కొమెరికా సెంటర్‌లో సందడి నెలకొంది. వారిని అనుసరిస్తూ కుటుంబసభ్యులు చప్పట్లు కొట్టారు. 

స్థానిక నృత్య పాఠశాల విద్యార్థుల నృత్యాలతో వేడుక మొదలయింది. అమ్మవార్లే కదిలివచ్చారా అన్నట్టుగా నవదుర్గ వేషధారణలో అమ్మాయిల ఊరేగింపు వైభవోపేతంగా సాగింది. నాలుగు గంటల పాటు సాగిన సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో సినీ నటి రీతూవర్మ సందడి చేశారు. అనంతరం విజయదశమి వేడుకలను నిర్వహించారు. శమీపూజ చేశారు. ‘అలయ్ బలయ్’ తీసుకుని సొంతగడ్డపై పండుగ చేసుకున్న ఆనందాన్ని పంచుకున్నారు.  

ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బృందం తమ పాటలు, సంగీతంతో ప్రేక్షకులను ఆనందింపజేశారు. గాయకులు లిప్సికా, రోల్ రైడా, ధనుంజయ్ తదితరులు తమ పాటలతో ఉర్రూతలూగించారు. ‘టీపాడ్’ ఆవిర్భావ కమిటీ ఛైర్మన్‌ అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, జానకి రామ్ మందాడి , రావు కల్వల, అధ్యక్షుడు రమణ లష్కర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాణి పంచెర్పుల,  కో-ఆర్డినేటర్ పాండు పాల్వాయి, పవన్ గంగాధర, అశోక్ కొండాల, రామ్ అన్నాడీ, గోలి బూచి రెడ్డి, సుధాకర్ కలసాని వేడుకలు విజయవంతానికి కృషి చేశారు. కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ ప్రేమ్ రెడ్డి, నాటా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తమవంతు సహాయ సహకారాలు అందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని