సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఎన్నారైల నివాళి 

తన పాటలతో ప్రపంచవ్యాప్తంగా సాహితీ అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెలకు యునైటెడ్ కింగ్‌డమ్‌ ఎన్నారైలు ఘనంగా నివాళులు అర్పించారు.

Updated : 14 Dec 2021 23:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన పాటలతో ప్రపంచవ్యాప్తంగా సాహితీ అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి యునైటెడ్ కింగ్‌డమ్‌ ఎన్నారైలు ఘనంగా నివాళులు అర్పించారు. తూర్పు లండన్ ఈస్ట్ హోమ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ‘‘సిరివెన్నెలకు అశృనివాళి’’ కార్యక్రమంలో పలువురు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రసాద్ మంత్రాల, సత్యప్రసాద్ మద్దసాని, నరేంద్ర మున్నలూరి, కృష్ణ సనపాల, యూకేలో హైదరాబాదీ బావర్చి రెస్టారెంట్ యజమాని కిషోర్ మునగాల ఈ సందర్భంగా మాట్లాడారు.  సిరివెన్నెల 2014లో లండన్‌ వచ్చినప్పడు తెలుగు ఎన్నారైలతో విడదీయలేని అనుబంధాన్ని ఏర్పరచుకున్నారని తెలిపారు. సిరివెన్నెల పాటలు తెలుగు యువతరాన్ని ఎంతగానో ఉత్తేజపరిచాయని, ఎల్లలు దాటి జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు దోహదం చేశాయని వారు అభిప్రాయపడ్డారు. 
 సిరివెన్నెల పేరిట ప్రతిష్టాత్మకంగా ఒక అవార్డు నెలకొల్పే దిశగా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. తెలుగు ప్రవాసులు సురేంద్రనాథ్ అలవాల, రమేష్ ముప్పన, కిషోర్ రెడ్డి మలిరెడ్డి తదితరులు ప్రసంగిస్తూ తెలుగు వారు గర్వించదగ్గ గొప్ప కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలతో పదికాలాల పాటు చిరంజీవిగా మన మధ్యే ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని