Updated : 08/01/2021 16:17 IST

ట్రంప్‌.. క్షమాభిక్ష కోరుకుంటున్నారా?

వాషింగ్టన్‌: అగ్రరాజ్య క్యాపిటల్ భవనంపై ట్రంప్‌ మద్దతుదారుల దాడితో అధ్యక్షుడిపై వ్యతిరేకత తారస్థాయికి చేరుకుంది. ఆయనను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ట్రంప్‌ ‘స్వీయ క్షమాభిక్ష’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తనను తాను క్షమించుకునే హక్కుపై అధ్యక్షుడు ట్రంప్‌ తన సన్నిహితులు, న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం. 

అధ్యక్ష పదవిని వీడే చివరి రోజుల్లో మరింత మందికి క్షమాభిక్ష కల్పించేందుకు ట్రంప్‌ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం జాబితా కూడా తయారుచేశారట. జనవరి 19న వీరి పేర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో వైట్‌హౌస్‌ సీనియర్‌ సిబ్బంది, సెలబ్రెటీలు, కుటుంబసభ్యలతో పాటు ట్రంప్‌ పేరు కూడా ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే ట్రంప్‌ తనకు తానే క్షమాభిక్ష పెట్టుకోవాలని చూస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. స్వీయ క్షమాభిక్ష ప్రకటించుకుంటే న్యాయపరంగా, రాజకీయంగా ఎదురయ్యే సవాళ్ల గురించి ట్రంప్‌ తన సన్నిహితులతో, న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. అయితే క్యాపిటల్‌ దాడి తర్వాత ఈ చర్చ జరిగిందా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. 

మూడేళ్ల కిందటే ఆలోచన..!

స్వీయ క్షమాభిక్షపై ట్రంప్‌ ఇప్పుడు కాదు.. మూడేళ్ల కిందటే దృష్టిపెట్టారు. దీనిపై తన న్యాయసలహాదారు రూడీ గులియానీతో గతంలో అనేక సార్లు చర్చలు జరిపారు. అంతేకాదు, ‘నన్ను నేను క్షమించుకునే హక్కు ఉంది. కానీ నేను ఏ తప్పు చేయనప్పుడు అలా ఎందుకు చేయాలి?’ అని 2018లో ట్రంప్‌ ట్వీట్ చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఓ వ్యక్తి తన కేసుకు తానే తీర్పు చెప్పుకోకూడదనే సూత్రానికి ఇది విరుద్ధమని పలువురు వాదించారు. గతంలో ఏ అధ్యక్షుడు కూడా స్వీయ క్షమాభిక్షకు ప్రయత్నించలేదు. ఒకవేళ ట్రంప్ ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం మరో న్యాయపోరాటానికి దారితీసే అవకాశం ఉంది.  

అలా కోరుకోవచ్చు, కానీ..

అయితే నిజంగా ట్రంప్‌ క్షమాభిక్ష కోరుకుంటే మాత్రం అందుకు ఓ అవకాశం ఉంది. ఆయన తన పదవి నుంచి దిగిపోయి.. ఉపాధ్యక్షుడిని తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలి. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు.. అధ్యక్ష హోదాలో ట్రంప్‌కు క్షమాభిక్ష పెట్టొచ్చు. అయితే ప్రస్తుతం ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, ట్రంప్‌ మధ్య సత్సంబంధాలు లేవు. కాంగ్రెస్‌ సమావేశంలో బైడెన్‌ గెలుపు ధ్రువీకరణను ఎలాగైనా ఆపాలని ట్రంప్‌.. పెన్స్‌పై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి ఆయన ఒప్పుకోకపోవడంతో ట్రంప్‌ ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన నుంచి క్షమాభిక్ష కోరే అవకాశాలు కన్పించట్లేదు. మరోవైపు ఒకవేళ ట్రంప్‌.. స్వీయ క్షమాభిక్ష ప్రకటించుకుంటే మాత్రం.. ఆయన తప్పు చేశానని అంగీకరించినట్లే అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చివరి రోజుల్లో ట్రంప్‌ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

ఇవీ చదవండి..

దారికొచ్చిన ట్రంప్‌

ట్రంప్‌ను మీరు తప్పిస్తారా.. లేదా?

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని