
ఫ్లోరిడాలో అంచనాలు తలకిందులు..!
వాషింగ్టన్: అధ్యక్ష పీఠానికి దగ్గర చేసేవిగా భావిస్తున్న రాష్ట్రాల్లో ఫ్లోరిడా ఒకటి. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ తన అధ్యక్ష పదవిని నిలుపుకోవాలంటే ఇక్కడ గెలవాల్సిందేనన్న వాదన ఉంది. కానీ, ప్రీ-పోల్స్ అన్నీ బైడెన్ వైపే మొగ్గుచూపడంతో డెమొక్రాటిక్ పార్టీ విజయం తథ్యమనకున్నారంతా. కానీ, ఫలితాల సరళి మాత్రం భిన్నంగా ఉంది. తొలుత స్వల్ప ఆధిక్యంతో ముందంజలో ఉన్న ట్రంప్.. క్రమంగా ఆ తేడాను పెంచుతూ వచ్చారు. దాదాపు ఈ రాష్ట్రం ట్రంప్ వశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ బృందమైతే ఇప్పటికే ఇక్కడ తాము విజయం సాధించామని ప్రకటించుకుంది. మరిన్ని కీలక రాష్ట్రాలైన జార్జియా, ఒహైయో, టెక్సాస్‌లోనూ ట్రంప్ ఆధిక్యం కనబరుస్తున్నారు.
ఫ్లోరిడాలో వెనుబడ్డ బైడెన్ యూటా, అరిజోనా, నెవాడాలో మాత్రం ట్రంప్‌ని వెనక్కి నెట్టారు. 2016లో ట్రంప్ గెలుచుకున్న మరికొన్ని రాష్ట్రాల్లోనూ బైడెన్ ముందంజలో ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు బైడెన్ 209 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో ముందంజలో ఉండగా.. ట్రంప్ 118 ఓట్లు సాధించారు. ఇక ఇప్పటి వరకు 45 రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. కాలిఫోర్నియా, ఇదాహో, ఒరేగాన్, వాషింగ్టన్లో కౌంటింగ్ పూర్తికాగా.. , హవాయి, అలస్కా రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.