ఘనంగా ‘హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ ఉగాది వేడుకలు

హాంకాంగ్‌లో ఉగాది వేడుకలను ప్రవాసాంధ్రులు ఘనంగా జరుపుకొన్నారు. గత రెండేళ్లుగా కొవిడ్‌ నిబంధనల కారణంగా ‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్ని నిర్వహించలేకపోయారు......

Published : 11 Apr 2022 15:22 IST

హాంకాంగ్‌: హాంకాంగ్‌లో ఉగాది వేడుకలను ప్రవాసాంధ్రులు ఘనంగా జరుపుకొన్నారు. గత రెండేళ్లుగా కొవిడ్‌ నిబంధనల కారణంగా ‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్ని నిర్వహించలేకపోయారు. అయితే, ఈ ఏడాది కొవిడ్‌ ప్రభావం ఉన్నప్పటికీ ఎలాగైనా ఉగాది నిర్వహించాలనే సంకల్పంతో జూమ్‌ వేదిక ద్వారా అంతా ఒకచోటకు చేరి ఉత్సాహంగా ఉగాది వేడుకలు జరుపుకొన్నారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో ఆట పాటలతో సందడి చేశారు. ఉగాది వేడుకల్ని హాంకాంగ్ తెలుగు సమాఖ్య  ప్రధాన కార్యదర్శి జయ పీసపాటి ప్రారంభించగా.. సాంస్కృతిక కార్యక్రమాల్ని శాంతి మోగంటి నిర్వహించారు. ఆర్థిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, ట్రెజరర్ నర్రా వరప్రసాద్, జనరల్ సెక్రటరీ జ్ఞానేశ్వర్, ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యులు సహకారం అందించారు.

తెలుగు ఎన్‌ఆర్‌ఐ ఐడల్‌ ద్వితీయ విజేత గాయని హర్షిణి పచ్చంటి తన అద్భుతమైన గాత్రంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. చిన్నా,పెద్దా అంతా కలిసి నృత్యాలు, పాటలతో అలరించారు. చిన్నారులు అక్షిత, దీక్షిత, ఇషిక, గుణ, స్వర్ణిక, లహరి, విద్య, సారా, జయంత్, అద్వైత్‌తో పాటు పెద్దలు మనోజ్, శ్రీహరి బాలాదిత్య  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రదర్శనల్లో శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యం, కూచిపూడి నృత్యం, సుమతీ శతకాలు, శాస్త్రీయ వాద్యం, భజన వంటి కార్యక్రమాలు ఉండటం ఈ వేడుకలకు మరింత అందాన్ని తెచ్చి పెట్టాయి. 

ఈ సందర్భంగా తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి జయ పీసపాటి మాట్లాడుతూ.. ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య సాధించిన పురోగతిని వివరించారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా మాతృభూమిలో ఎంతోమంది బాధితులకు సహాయం అందజేసినట్టు తెలిపారు. స్థానిక వలస కార్మికులకు సేవలందిస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు సేకరించి ఆర్థికంగా సాయం చేసినట్టు ఆమె తెలిపారు. ఏటా ఉగాది వేడుకల్లో ఉగాది పురస్కారాలతో విశిష్టమైన సామాజిక సేవలందించిన వారిని గుర్తించడం ఒక ఆనవాయితీగా ఉండగా.. ఈ ఏడాది కూడా కొవిడ్‌ సమయంలో సామాజిక మానవీయ దృక్పథంతో సేవలందించిన స్థానిక భారతీయులను ఈ ఉగాది వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. 

ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా రాఘవేంద్రన్, నందిని, సోనాల్‌ షా, దీప్తి రామచంద్రన్  హాజరయ్యారు. వీరంతా కరోనా సమయంలో హాంకాంగ్‌లో సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు అందించిన సేవలను కొనియాడి వారందరినీ సత్కరించారు. అలాగే, హాంకాంగ్‌కు చెందిన కుంజ్ గాంధీ, టెస్స లైసన్స్‌ అనే వ్యక్తులు తమ ఫేస్‌బుక్‌ గ్రూపు “HKQSG” ద్వారా కరోనా సమయంలో అందరికీ అందించిన సహాయ సహకారాల్ని కొనియాడారు. ఈ సందర్భంగా రాఘవేంద్రన్‌ మాట్లాడుతూ..  తాము 2015 నుంచి సేవలు ప్రారంభించినా, ఇప్పటివరకు తమ సేవల్ని ఎవరూ ఇలాంటి వేదికలపై గుర్తించలేదనీ.. తమను ఎవరూ ఆహ్వానించలేదన్నారు. ఇప్పుడు తమను గుర్తించి ఆహ్వానించిన హాంకాంగ్‌ తెలుగు సమాఖ్యకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెలుగు సమాఖ్య ముఖ్య కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఈ ఉగాది వేడుకల పట్ల హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు. ఫ్రంట్‌లైన్ కార్యకర్తలందరికీ తమ హర్షధ్వానాలతో జేజేలు పలుకుతూ.. ‘జై తెలుగు తల్లి, జైహింద్‌’ అని వందనం చేస్తూ వేడుకల్ని ముగించారు. వచ్చే ఏడాది అంతా కలిసి విందు భోజనాలతో వేడుకలు చేసుకుందామని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని