
తైవాన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
తైవాన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కౌషాంగ్ నగరంలోని సన్ యట్ సెన్ విశ్వ విద్యాలయ ఆడిటోరియం ఈ వేడుకలకు వేదికైంది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకలకు ఆ దేశ అంతర్జాతీయ వ్యవహారాలశాఖ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చివెన్ కోతో పాటు, డాక్టర్ విన్సెంట్ లీ, ఇంతియాజ్ అహ్మద్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తైవాన్‌లోని తెలుగువారినందరినీ ఒక్కతాటి పైకి తెచ్చేందుకు గతేడాది ఆగస్టులో తైవాన్ తెలుగు సంఘం ఏర్పాటైంది. తాజా వేడుకల్లో భాగంగా ఉగాది పచ్చడితో పాటు, నోరూరించే తెలుగు సంప్రదాయ వంటకాలతో నిర్వాహకులు విందు ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలూ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని నృత్య సంగీతాలతో అలరించారు. మంగ్లి ఆలపించిన పాటకు చిన్నారి గీతూ సహస్ర చేసిన నృత్యం, రూపా గాయత్రి ప్రదర్శించిన నృత్యరూపకం ఆకట్టుకున్నాయి. కౌషాంగ్ కమిటీ సభ్యులు ఆదిత్య కొల్లి, రామకృష్ణ కిశోర్, చంద్రశేఖర్, శ్వేత... తైవాన్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు దామోదర్, వీరబాబు, మనోజ్, సత్యం, గురునాథం, ఏడు కొండలు తదితరులు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. రూపిణి, వాసంతి, సుస్మిత, సలావుద్దీన్, దుర్గ, ప్రశాంతి, ఈశ్వర్ తదితరులు సాంస్కృతిక కార్యక్రమాలు పర్యవేక్షించారు.
భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలపరుచుకోవాలనుకుంటున్న తైవాన్ ప్రభుత్వం దీపావళి సంబరాలకు తానే ఆతిథ్యం ఇచ్చింది. తైవాన్ లో పలువురు భారతీయ విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విశ్వవిద్యాలయాలు కూడా ఈ సంబరాలకు సహకారం అందించడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.