Rishi Sunak: టీవీ డిబేట్‌లో రిషి సునాక్‌ అనూహ్య విజయం.. ఇరకాటంలో లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌ ప్రధాని ఎన్నిక కోసం జరుగుతోన్న రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఆయన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ కంటే వెనుకంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతోన్న వేళ..

Updated : 05 Aug 2022 15:53 IST

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని ఎన్నిక కోసం జరుగుతోన్న రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఆయన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ కంటే వెనుకంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతోన్న వేళ.. ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కీలకమైన టీవీ డిబేట్‌లో ట్రస్‌పై రిషి అనూహ్య విజయం సాధించారు. స్కై న్యూస్‌ నిర్వహించిన ‘బ్యాటిల్‌ ఫర్‌ నంబర్‌ 10’ టీవీ డిబేట్‌లో స్టూడియో ప్రేక్షకులు సునాక్‌కు మద్దతిచ్చారు.

ఈ టీవీ డిబేట్‌లో ప్రధాని పదవికి తాము ఎందుకు అర్హులమో ఇరువురు అభ్యర్థులు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రిషి సునాక్‌ మాట్లాడుతూ.. ‘‘పన్నుల తగ్గింపు కంటే ముందు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ద్రవ్యోల్బణం మరింత పెరిగితే మోర్టగేజ్‌ రేట్లు పెరుగుతాయి. మన సేవింగ్స్‌, పింఛన్లు అన్నీ ఆవిరవుతాయి’’ అని అన్నారు. అనంతరం లిజ్‌ ట్రస్‌ మాట్లాడుతూ.. అధిక పన్నుల వల్లే బ్రిటన్‌లో మాంద్యం భయాలు తలెత్తుతున్నాయని అన్నారు. దీనిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్‌ వాదనను సునాక్‌ తోసిపుచ్చారు. ద్రవ్యోల్బణం వల్లే మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఇరువురి వాదనలు పూర్తయిన తర్వాత స్టూడియోలోని ఆడియన్స్‌కు ఓటింగ్‌ పెట్టారు. ఇందులో ఎక్కువ మంది రిషి సునాక్‌కు మద్దతుగా ఓటువేశారు. దీంతో ఈ డిబేట్‌లో సునాక్‌ విజయం సాధించినట్లు ప్రజెంటర్‌ ప్రకటించారు.

లిజ్‌ ట్రస్‌ అసహనం..

ఈ సందర్భంగా టీవీ ప్రజెంటర్‌.. లిజ్ ట్రస్‌ను తన ప్రశ్నలతో కొంత ఇరకాటంలో పడేశారు. ఇటీవల ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి ట్రస్‌ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ప్రభుత్వ రంగ ఉద్యోగుల జీతాలను తగ్గిస్తే ప్రభుత్వానికి 8.8 బిలియన్‌ యూరోలు ఆదా అవుతాయని ఆమె అన్నారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఈ ప్రకటనపై ఆమె యూటర్న్‌ తీసుకున్నారు. తాజాగా జరిగిన టీవీ డిబేట్‌లో ప్రజెంటర్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ట్రస్‌పై ప్రశ్నలు కురిపించారు. 

‘ఉద్యోగుల జీతాలపై మీరు మీకు ప్రకటనను వెనక్కి తీసుకున్నారు’ అని ప్రజెంటర్‌ అనగా.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ట్రస్‌ ఆరోపించారు. దీనికి ప్రజెంటర్‌ స్పందిస్తూ.. ‘‘మంచి నేతలు తమ తప్పులను ఒప్పుకొంటారా లేదా ఇతరులను నిందిస్తారా?’’ అని ప్రశ్నించారు. తాను ఎవరినీ నిందించడం లేదని.. కొంతమంది వ్యక్తులు తన ప్రకటనను తప్పుదోవ పట్టించారంటూ కొంత అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. ప్రధాని రేసులో లిజ్‌ ట్రస్‌ ముందంజలో ఉన్నట్లు నిన్న ఓ సర్వే వెల్లడించింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. లిజ్‌ ట్రస్‌కు కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో 58 శాతం మంది మద్దతు ఉన్నట్లు తేలగా, మాజీ మంత్రి రిషి సునాక్‌కు 26 శాతం మాత్రమే మద్దతు పలికారు. అయితే ఎంపీల్లో మాత్రం సునాక్‌కే మద్దతు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని