Updated : 23 Nov 2020 14:12 IST

అవి ఊహాజనిత ఆరోపణలు

ఆధారాలు చూపలేదు  

పోస్టల్‌ బ్యాలెట్ల రద్దుపై ట్రంప్‌ వ్యాజ్యాన్ని కొట్టివేసిన పెన్సిల్వేనియా కోర్టు 
వాషింగ్టన్‌: పోస్టల్‌ బ్యాలెట్లను రద్దు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని యూఎస్‌ మిడిల్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ పెన్సిల్వేనియా కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఊహాజనిత ఆరోపణలు చేశారని, ఇందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదని జడ్జి మ్యాథ్యూ బ్రాన్‌ పేర్కొన్నారు. వాదనల్లో ఒత్తిడి కనిపిస్తోందని, ఎలాంటి పసలేదని తెలిపారు. ఇక్కడ బైడెన్‌ 81వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఓట్లన్నింటినీ రద్దు చేయాలన్నట్టుగా వాదనలు వినిపించారని జడ్జి పేర్కొన్నారు. ఇంత భారీయెత్తున అక్రమాలు జరిగి ఉంటే అందుకుతగ్గ ఆధారాలు ఉండాలి కదా అని వ్యాఖ్యానించారు. ఒక్క ఓటును కూడా రద్దు చేయడానికి అధికారాలు లేవని చెప్పారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని ట్రంప్‌ తరఫు న్యాయవాదులు తెలిపారు. కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల్లో బైడెన్‌ గెలిచారంటూ ధ్రువపత్రం ఇచ్చే అవకాశం ఆ రాష్ట్ర అధికారులకు కలిగింది. 
జార్జియాలో తిరిగి లెక్కింపునకు దరఖాస్తు
జార్జియాలో ఓట్లను తిరిగి లెక్కించాలని కోరుతూ ట్రంప్‌ దరఖాస్తు చేశారు. తొలుత ఇక్కడ ఓట్ల లెక్కింపు జరిపినప్పుడు డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌కు దాదాపు 14వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. దాంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే రీకౌంటింగ్‌కు ఆదేశించి మొత్తం 50 లక్షల ఓట్లను చేతితో లెక్కించేలా ఏర్పాట్లు చేసింది. ఓట్ల ఆడిటింగ్‌గా పిలిచే ఈ ప్రక్రియలో బైడెన్‌కు 12,284 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయినా సంతృప్తి చెందని ట్రంప్‌ ఇంకోసారి ఓట్లను లెక్కించాలని కోరుతున్నారు. సంతకాలు సరిపోకపోతే ఆ ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలని డిమాండు చేసున్నారు. ఒకవేళ రీకౌంటింగ్‌కు అనుమతి ఇస్తే పోలయిన ఓట్లన్నింటినీ మరోసారి స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రం ట్రంప్‌ పార్టీ అయిన రిపబ్లికన్‌ ఆధీనంలో ఉంది. 
బైడెన్‌ను అధ్యక్షుడిగా గుర్తించను: పుతిన్‌
మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికను గుర్తించేందుకు సిద్ధంగా లేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదివారం వెల్లడించారు. అమెరికా ప్రజల విశ్వాసం ఉన్న ఏ నాయకుడితోనైనా పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కానీ, చట్టబద్ధంగా ఎన్నికైన వారు లేదా ప్రతిపక్ష పార్టీ గుర్తించిన వారు.. ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారని పుతిన్‌ అభిప్రాయపడ్డారు. అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కు దాదాపు అన్ని దేశాలు శుభాకాంక్షలు తెలిపినా రష్యా మాత్రం స్పందించలేదు. ఈ విషయంపై ఆయన్ను ప్రశ్నించగా.. బైడెన్‌ను అభినందించకూడదని నిర్ణయం తీసుకున్నామని పుతిన్‌ చెప్పారు. దీంతో రష్యా- అమెరికా మధ్య  సంబంధాలు దెబ్బతినవా అని అడగగా.. ఇప్పటికే నాశనమయ్యాయని, ఇంకా దెబ్బతినడానికి ఏమీ లేదని ఆయన బదులిచ్చారు. 
ట్రంప్‌ చర్యలతో అమెరికన్‌ ప్రజాస్వామ్యానికి చేటు
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు చేస్తున్నదంతా అమెరికన్‌ ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తుందని కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ‘చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌’ రొనాల్డ్‌ క్లైన్‌ ధ్వజమెత్తారు. రికార్డు స్థాయిలో అమెరికన్‌ ఓటర్లు ట్రంప్‌ నాయకత్వాన్ని తిరస్కరించారన్నారు. కానీ ఓటింగ్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ ట్రంప్‌ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో అక్రమాల ఆరోపణలతో ట్రంప్‌ అనేక న్యాయస్థానాల్లో వ్యాజాలు వేశారన్నారు. ఇది మంచిది కాదని.. ఎన్నిచేసినా ఎన్నికల ఫలితాల్లో మార్పు రాదని అన్నారు. జనవరి 20న బైడెన్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఖాయమని చెప్పారు. ‘‘ట్రంప్‌ ఎన్నటికీ మారరు. నాలుగేళ్లు అమెరికాను అస్తవ్యస్తం చేశారు. తన పదవీకాలంలోని చివరి రోజుల్లోనూ ఆయన అదే చేయాలనుకుంటున్నారు.’’ అని క్లైన్‌ ధ్వజమెత్తారు. 
కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ దేశాన్ని ఒకేతాటిపైకి తేవడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు జనవరి 20వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారని, వారంతా కలిసి పనిచేయాలనుకుంటున్నారని అన్నారు. ‘‘శ్వేతసౌధంలోను, మంత్రివర్గంలోనూ పనిచేసే వారిని ఎంపిక చేశాం. మేము మా విధాన ప్రణాళికను రూపొందిస్తున్నాం. దేశవ్యాప్తంగా నేతలతో ఉన్నతస్థాయి సమావేశాలు జరుపుతున్నాం.’’ అని క్లైన్‌ తెలిపారు.-  బైడెన్‌ ‘చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌’ రొనాల్డ్‌ క్లైన్‌
ఆ కొవిడ్‌ ఔషధానికి అత్యవసర అనుమతి
కొవిడ్‌-19ను ఎదుర్కోవడంలో శరీర రోగ నిరోధక వ్యవస్థకు సాయం అందించే రెండో యాంటీ బాడీ ఔషధానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. గత నెలలో ఈ మహమ్మారి బారినపడినప్పుడు దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇదే ఔషధాన్ని వైద్యులు ఇచ్చారు. స్వల్ప స్థాయి నుంచి ఒక మోస్తరుగా వ్యాధి లక్షణాలు కలిగిన కొవిడ్‌ బాధితుల ఆరోగ్యం విషమించకుండా, ఆసుపత్రిపాలు కాకుండా ఈ ఔషధం ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. దీన్ని రిజెనరాన్‌ ఫార్మా సంస్థ ఉత్పత్తి చేస్తోంది. దీన్ని ఒక్కసారే ఇస్తారు. వయసు లేదా ఇతర అనారోగ్య కారణాల వల్ల తీవ్ర కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్న బాధితులకు దీన్ని ఇవ్వవచ్చని ఎఫ్‌డీఏ తాజాగా తెలిపింది. కనీసం 40 కిలోల బరువు ఉండి, 12 ఏళ్లు పైబడిన చిన్నారులకూ ఇవ్వవచ్చని పేర్కొంది.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని